మరికొన్ని రోజుల్లో ఆ యువకుడికి పెళ్ళి.. కుటుంబీకులందరూ ఆ పనుల్లో బిజీగా ఉన్నారు.. అంగరంగ వైభవంగా పెళ్ళి నిర్వహించాలని రంగం సిద్ధం చేస్తున్నారు.. కానీ ఇంతలో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహేతర సంబంధం ఆ యువకుడ్ని బలి తీసుకుంది. పెళ్ళి పీటలు ఎక్కాల్సిన తమ అబ్బాయి.. పాడె ఎక్కాల్సి వచ్చిందంటూ కుటుంబీకులు భోరమంటూ విలపిస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
అల్లిపురానికి చెందిన గట్ల నవీన్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. కొన్నాళ్ళ క్రితం ఇతనికి అదే చెందిన కల్పన అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇన్నాళ్ళూ గుట్టుచప్పుడు కాకుండా తమ సంబంధాన్ని వీళ్లు కొనసాగించారు. అయితే, ఇటీవల వీరి విషయం కల్పన భర్త వీరబాబుకి తెలిసింది. దీంతో కోపాద్రిక్తుడైన అతడు, ఎలాగైనా నవీన్‌ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకు ఓ పథకం వేశాడు. తన భార్యనే ఎరగా వేసి, అతడ్ని చంపాలని ఫిక్సయ్యాడు.
ప్లాన్ ప్రకారం.. ఆదివారం రాత్రి వీరబాబు తన భార్య కల్పనతో నవీన్‌కు ఫోన్ చేయించాడు. ఖమ్మం శివారు గోపాలపురం వద్దకు రమ్మని పిలిపించాడు. నవీన్ అక్కడికి రావడమే ఆలస్యం, వీరబాబు అతనిపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కల్పన మీద కూడా రవిబాబు దాడి చేశాడు. ఈ ఘటనలో నవీన్ అక్కడే కూలిపోగా.. కల్పనకు స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న నవీన్ బంధువులు.. వెంటనే అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అతడు చికిత్స పొందుతూ.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో మృది చెందాడు.
కాగా.. కొన్ని రోజుల క్రితమే నవీన్‌కు నిశ్చితార్థం జరిగింది. జూన్ 9న అతని వివాహం జరగాల్సి ఉంది. ఇంతలో ఈ ఘోరం జరగడంతో.. నవీన్ కుటుంబీకులు రోదిస్తున్నారు. పథకం ప్రకారమే.. కల్పన, వీరబాబు కలిసి తమ నవీన్‌ని చంపేశారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.