Bihar: మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న బీహార్ రాష్ట్రంలో వరసగా జరుగుతున్న కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా, ఆదివారం పాట్నాలోని పోలీస్ స్టేషన్ సమీపంలో, పట్టపగలు ఓ న్యాయవాదిని కాల్చి చంపారు. మరణించిన వ్యక్తిని జితేంద్ర కుమార్‌గా గుర్తించారు. అయితే, గత రెండేళ్లుగా ఇతను న్యాయవృత్తిలో చురుకుగా లేరని, ప్రాక్టీసింగ్ మానేనట్లు పోలీసులు తెలిపారు.
పాట్నాలోని సుల్తాన్ గంజ్ పోలీస్ స్టేషన్‌కు 300 మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. వరసగా బీహార్‌లో జరుగుతున్న కాల్పుల ఘటనలు ప్రజల్లో భయాందోళనలు రేపుతున్నాయి. మృతుడు జితేంద్ర కుమార్ ప్రతీ రోజు సాధారణంగా వచ్చే టీ కొట్టు వద్ద ఈ హత్య జరిగింది. కాల్పులు జరిపిన తర్వాత నేరస్తులు పారిపోయారు. పాట్నా ఎస్పీ పరిచయ్ కుమార్ మాట్లాడుతూ.. కాల్పుల తర్వాత, అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించామని, గాయాల కారణంగా మరణించారని చెప్పారు. సంఘటనా స్థలం నుంచి మూడు ఖాళీ బుల్లెట్ షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Read Also: Jharkhand: ఏంటీ 800 బాటిళ్ల మద్యాన్ని ఎలుకలు తాగాయా..? ఏం కవరింగ్ భయ్యా..
దీనికి ముందు శనివారం బీహార్‌లోని సీతామర్హి జిల్లాలోని అత్యంత రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతమైన మెహసౌల్ చౌక్ వద్ద వ్యాపారవేత్త పుతు ఖాన్ తలపై గుర్తు తెలియని దుండగులు పాయింట్-బ్లాంక్ రేంజ్‌లో కాల్చి చంపారు. గంటల వ్యవధిలోనే పాట్నా జిల్లాలోని షేక్ పురాలో వెటర్నరీ డాక్టర్ సురేంద్ర కుమార్ (50) తన పొలంలో కాల్చి చంపబడ్డాడు. బైక్ పై వచ్చని దుండగులు కాల్పులు జరిపారు. వీటికి ముందు శుక్రవారం సాయంత్రం పాట్నాలోని రామకృష్ణ నగర్ ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుడు కిరాణా దుకాణం యజమాని విక్రమ్ ఝాను కాల్చి చంపారు. ఈ కాల్పుల ఘటనల్లో ఇప్పటి వరకు దుండగులు దొరకలేదు.