దేశవ్యాప్తంగా 12 కి పైగా ప్రదేశాలలో దాడులు నిర్వహించారు. ఢీల్లీలో పోలీసులు ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. 8 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి ఈ దాడులు నిర్వహించారు. ప్రధాన నిందితుడు అఫ్తాబ్ ముంబై నివాసి కాగా.. అషర్ డానిష్ అనే మరో అనుమానితుడిని కూడా రాంచీలో అరెస్టు చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ పోలీసులు, జార్ఖండ్ ATS, రాంచీ పోలీసులు కలిసి దేశ వ్యాప్తంగా దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకోవడంతో పాటు.. ఒక ఐసిన్ ఉగ్రవాదిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అరెస్టు చేసిన అనుమానితులందరినీ విచారిస్తున్నారు. రాంచీలో ఒక అనుమానితుడిని అరెస్టు చేయగా.. జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఒక లాడ్జిలో అనుమానిత ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో భయాందోళనకు గురయ్యారు స్థానికులు.
రాంచీలోని లోయర్ బజార్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఇస్లాం నగర్‌కు చెందిన ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. అతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. దీని తర్వాత పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ దాడిలో అనేక అభ్యంతరకరమైన వస్తువులు, పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు కూడా సమాచారం. రాంచీలో అరెస్టు చేయబడిన అనుమానిత ఉగ్రవాది పేరు అషర్ డానిష్, అతను బొకారో జిల్లాలోని పెట్వార్ నివాసి అని చెబుతున్నారు. ఢిల్లీలో నమోదైన కేసు ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. ఉగ్రవాద సంస్థలతో అతనికి ఉన్న సంబంధాలపై విచారణ చేపట్టారు అధికారులు.