Madhya Pradesh: భర్త మద్యపానం వ్యసనం నుంచి బయటపడేందుకు ఓ తాంత్రికుడిని ఆశ్రయించిన మహిళపై దారుణం జరిగింది. తాంత్రికుడు మహిళను బెదిరిస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భర్త మందుతాగడం మానేయాలని కోరుతూ 30 ఏళ్ల మహిళ ఓ తాంత్రికుడిని సంప్రదించింది. అయితే, ఆచారమని చెబుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా తనకు లొంగకపోతే ‘ఆత్మలు’ వెంటపడుతాయని బెదిరించాడు.
తాంత్రికుడు పదేపదే తన వద్దకు మహిళను రావాలని కోరేవాడు. రెండు నెలలు పాటు జూలై 10 వరకు మహిళను లైంగికంగా వేధించాడు. చివరకు తన భర్తతో కలిసి సదరు మహిళ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. రెండు నెలల పాటు తనను ఆర్థికంగా, లైంగికంగా దోపిడి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. నిందితుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అయితే, భార్యభర్తలు ఇద్దరూ కూడా ఆత్మల ప్రభావంలో ఉన్నారని తాంత్రికుడు చెప్పడం గమనార్హం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మే 4, 2024లో గ్వాలియర్‌లోని ఉటైలా గ్రామంలో ఈ ఘటన జరిగింది. అఘాయిత్యం తర్వాత తనకు సహకరించకపోతే భార్యభర్తలపైకి చీకటి ఆత్మల్ని వదులుతానని బెదిరించాడు. నిందితుడైన క్షుద్ర తాంత్రికుడిని హర్ నారాయణ్ రాజౌరియాగా గుర్తించారు. జూలై 4న, మహిళ, ఆమె భర్త తాంత్రికుడి ఇంటికి వచ్చారు. భర్తకు భూతవైద్యం అవసరమని చెప్పి అతడిని వేరే గతిలోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత వచ్చి భర్తకు ఆచారాలు పూర్తయ్యాయని, ఇప్పుడు నువ్వు కూడా ఆచారాలు చేయాలని మహిళకు చెప్పాడు. మహిళను వేరే గదిలోకి తీసుకెళ్లిన తాంత్రికుడు క్షుద్ర విద్యల పేరుతో ఆమెపై అత్యాచారం చేశాడు. దీనిని ఎవరికైనా చెబితే చేసిన కర్మలన్ని ఫలించవని చెప్పాడు.