ప్రస్తుతం సమాజంలో చాలామందికి ప్రాణం విలువ తెలియడంలేదు. చిన్న చిన్న కారణాలకు ఆత్మహత్యలకు పాల్పడి నిండు ప్రాణాలను తీసుకుంటున్నారు. అమ్మ తిట్టిందని, నాన్న కొట్టాడని, పరీక్షా ఫెయిల్ అయ్యానని ఇలా చిన్నచిన్నవాటికే బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక యువతి తల్లిదండ్రులు తిట్టారనే అవమానభారంతో ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్ లో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. నెక్కొండ రజక వాడకు చెందిన అమృత, చెల్లెలు అంజలి, తల్లిదండ్రులతో కలిసి నివసిస్తోంది. అయితే గత కొన్ని రోజులుగా అమృత అదే గ్రామానికి చెందిన జహీర్ అనే యువకుడు ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం ఇటీవల ఇంట్లో తెలియడంతో రెండు రోజుల క్రితం అమృత కుటుంబ సభ్యులు జహీర్ వాళ్లింటికి వెళ్లి గొడవపెట్టుకున్నారు. పెద్దవాళ్ళతో పాటు అమృత చెల్లెలు అంజలి కూడా జహీర్ ఇంటికి వెళ్ళింది. అక్కడ తమ కుటుంబాన్ని జహీర్ కుటుంబం అవమానించడం తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా ఇంటికి వచ్చాక తలిదండ్రులు ఇద్దరు కూతుళ్లను ఇలాంటి పని చేసినందుకు తిట్టారు. ఇక ఆ అవమానం భరించలేని అంజలి శనివారం రాత్రి బహిర్బూమికి వెళ్తున్నానని చెప్పి దగ్గర్లో ఉన్న వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. బావిలో నీరు ఎక్కువగా ఉండడంతో ఆదివారం అంజలి మృతదేహాన్ని బయటికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు