ఈ కాలంలో ఫోన్ గురించి, యూట్యూబ్ గురించి తెలియని వారుండరు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా యూట్యూబ్ లో ప్రత్యేక్షమైపోతుంది. ఇంట్లో ఎలా ఉంటున్నాము అనే దగ్గర నుంచి ఆపరేషన్ ఎలా చేస్తారు అనేదాని వరకు అన్ని యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా ఒక మైనర్ బాలిక యూట్యూబ్ లో చూసి తనకు తానే ప్రసవం చేసుకొని పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన కేరళలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. మలప్పురం గ్రామానికి చెందిన ఒక 17 ఏళ్ల బాలిక ఇంటర్ చదువుతోంది. ఆమె తండ్రి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తుండగా.. తల్లికి కంటిచూపు లేకపోవడంతో ఇంట్లోనే ఉంటుంది. ఇక ఈ నేపథ్యంలోనే బాలిక, పక్కింట్లో నివసిస్తున్న 21 ఏళ్ల యువకుడు ప్రేమించుకున్నారు.. ప్రేమగా మాయమాటలు చెప్పి యువకుడు, బాలికను లొంగదీసుకున్నాడు. ఇంట్లో తండ్రి బయటికి వెళ్లగానే బాలిక, ప్రియుడిని ఇంటికి పిలిచేది.. తల్లికి కళ్లు కనిపించకపోవడంతో ఆమెకు తెలియకుండా వీరిద్దరూ వాళ్లింట్లోనే కలిసేవారు. కొద్దిరోజులకు బాలిక గర్భవతి అయ్యింది. ఇంట్లో ఎవరికి తెలియకుండా ఇద్దరు మేనేజ్ చేస్తూ వచ్చారు. కాగా, అక్టోబర్ 20 న బాలికకు నెలలు నిండడంతో పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో ఏం చేయాలో తెలియని బాలిక యూట్యూబ్ ఆన్ చేసి తనకు తానే ప్రసవం చేసుకొని మగబిడ్డకు జన్మనిచ్చింది.
ఇంట్లో ఉండే కత్తితో యూట్యూబ్ లో చూపినట్లు బిడ్డ బొడ్డుతాడును కత్తిరించింది. ఇంత జరుగుతున్నా తల్లిదండ్రులకు తెలియకపోవడం గమనార్హం. మూడో రోజు బిడ్డ ఏడుపు విన్న తల్లి నిలదీయడంతో గుట్టు బయటపడింది. తల్లి, బిడ్డకు ఇన్ఫెక్షన్ కావడంతో వారిని శిశు సంక్షేమ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై సమాచారం అందుకున్న పోలీసులు వారి పెళ్లి విషయమై పెద్దలతో మాట్లాడారు. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలనీ నిశ్చయించారు. ప్రస్తుతం ఈ ఘటన కేరళలో సంచలనంగా మారింది.