ఆన్లైన్ మోసాలు ఎక్కువైపోతున్నాయి.. ఈ మోసాలు పలురకాలు.. కొంతమంది బ్యాంకు వివరాలను మాయమాటలు చెప్పి తెలుసుకొని కొట్టేస్తుంటే.. ఇంకొంతమంది మ్యాట్రిమోని పేరుతో డబ్బులు కొట్టేస్తున్నారు. మరికొంతమంది డబ్బుతో పాటు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నారు. తాజాగా ఒక వ్యక్తి తనకు తాను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పి నలుగురు యువతులను మోసం చేసిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. బెల్గాంకు కుంపాత్‌గిరి ప్రాంతానికి చెందిన ప్రశాంత్ భౌరో పాటిల్(31) అనే వ్యక్తి మ్యాట్రిమోనీలో వధువు కావలెను అని ప్రొఫైల్ పెట్టాడు.. తాను ఆర్మీ ఆఫీసర్ అని చెప్పడంతో అతడి ప్రొఫైల్ నచ్చి ఒక యువతి అతడితో చాట్ చేసింది. కొన్నిరోజులు మాట్లాడుకున్నాకా ఆ యువతి అతడి మాయలో పడిపోయింది. వెంటనే అతడు కలుద్దామని అడగడంతో గత నవంబరు 18న బెంగళూరులోని ఒక ఆలయంలో వీరిద్దరూ కలుసుకున్నారు. అప్పుడు కూడా అతడు ఆర్మీ దుస్తుల్లో రావడంతో యువతికి అనుమానం రాలేదు. ఆ తరువాత ఇద్దరు ఇంట్లో చెప్పకుండా ఒక హోటల్ లో వివాహం చేసుకున్నారు.
అనంతరం ఈ వివాహం గురించి మీ ఇంట్లో చెప్పవద్దని, త్వరలోనే నేను వచ్చి మాట్లాడతానని నమ్మించి ఆమెను లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో కారులో బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత.. కొన్ని రోజులకు యువతి ఫోన్‌ను బ్లాక్‌లో పెట్టేశాడు. దీంతో యువతి తాను మోసపోయానని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అతను ఇప్పటివరకు ముగ్గురు అమ్మాయిలను కూడా ఇలాగే మోసం చేసాడని అధికారులు తెలిపారు.