భర్త చనిపోవడంతో మరో వ్యక్తితో సహజీవనం చేస్తోన్న ఓ మహిళ.. శనివారం రాత్రి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే.. కోట మండలం చిట్టేడుకు చెందిన గెడి నిరూప (28) 2016లో అదే గ్రామానికి చెందిన కొమ్మ రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి ప్రేమకు ముందునుంచే నిరూప తల్లిదండ్రులు వ్యతిరేకంగా ఉన్నారు. అయినా తమ మాట వినకుండా రాజశేఖర్‌ను పెళ్ళి చేసుకోవడంతో వాళ్ళు కోపంతో రగిలిపోయారు. ఈ క్రమంలోనే 2018లో నిరూప తండ్రి రామయ్య తన అల్లుడు రాజశేఖర్‌ను హత్య చేశాడు.
భర్త చనిపోవడంతో.. నిరూప తన బిడ్డ ప్రీతిని తీసుకొని అత్తమామల దగ్గరకు వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత నిరూపకు శ్రీసిటీలో ఉద్యోగం వచ్చింది. ఈ క్రమంలో ఈమెకు దక్కిలి మండలానికి చెందిన పరశురామ్‌తో పరిచయం ఏర్పడింది. కూతురితో ఒంటరిగా ఉన్న తనకు తోడుగా ఉంటాడన్న నమ్మకంతో.. పరశురామ్‌కు దగ్గరైంది. పూడి గ్రామంలో అతనితో సహజీవనం చేస్తోంది. ఇంతలో ఏమైందో ఏమో తెలీదు. నిరూప జీవితం మళ్లీ చీకటిమయం అయ్యింది. దీంతో ఆమె శనివారం రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత, తన నాలుగేళ్ల కుమార్తె ప్రీతికి బిస్కెట్లు పెట్టి, అనంతరం చీరతో ఉరేసుకుంది. ఈ విషయం గమనించిన చిన్నారి ఏడుస్తూ ఉండడంతో స్థానికులు ఇంటికి చేరుకున్నారు. అయితే, అప్పటికే నిరూప మృతి చెందింది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం నిరూప మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగించేందుకు ప్రయత్నించగా.. వాళ్లు అంగీకరించలేదు. దీంతో పోలీసులే పోలీసులే అంత్యక్రియలు పూర్తి చేశారు. చిన్నారి ప్రీతిని తాత ఆదినారాయణకు అప్పగించారు. అయితే.. నిరూప ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.