ప్రేమికులకు ప్రేమ అంటే అమృతం దొరికినట్లే అంటూ ఫీలతూ వుంటారు. ప్రేమలో వున్న వారికి ఏంచేస్తున్నామో .. ఏజరుగుతుందో అర్థంకాని ఆయోమయ ప్రపంచంలో వుంటారు. ప్రేమకు బానిసలై ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. ప్రేమను కాదన్నారనో, బ్రేకప్ అయ్యిందనో, పెళ్లికి నిరాకరించారనో, మోసం చేశారనో లవర్స్. ప్రేయసో.. ప్రియుడో ఆత్మహత్య చేసుకున్నారని వార్తలు తరచూ చూస్తుంటాం. అయితే, ఇది దీనికి పూర్తిగా భిన్నం. ప్రేమకథల్లో ఉండాల్సిన ట్విస్టులతో పాటు..ఇందులో మరో ఊహించని ట్విస్ట్ ఉంది. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఓ విచిత్ర ప్రేమ కథ వెలుగు చూసింది.ఆ ప్రేమకథ ప్రియుడి సూసైడ్‌తో విషాదాంతమైంది.
ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్ (31)గా గుర్తించారు. అతను ఆత్మహత్య చేసుకోవడమే కాక… ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులు లేఖ రాసి ఆ మొత్తాన్ని వసూలు చేయాలని ఆయన ఉత్తరం రాయడం చర్చనీయాశమైంది.
వివరాల్లోకి వెళితే..చిక్కమగళూరు జిల్లా శంకరాపురకు చెందిన చేతన్ తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు. ఇద్దరు తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాలు కోసం చేతనే డబ్బులు ఖర్చు చేసేవాడు. అలా ఆమె కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందని స్నేహితులతో చెప్పి వాపోయేవాడు చేతన్.
సరకు రవాణా వాహనాలు నడుపుతూ జీవించే అతను తన ఆదాయంలో అధికభాగం ఆమె కోసమే ఖర్చు చేసేవాడట. ఇటీవల పెళ్లి చేసుకుందామని ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయిన చేతన్.. చివరికి జీవితంపై విరక్తి చెంది సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు.
అయితే చేతన్ మృతదేహం వద్ద ఒక లేఖ లభించింది. అందులో నా ప్రేయసి సరదాల కోసం రూ.4.50 లక్షలు ఖర్చు చేశానని పేర్కొన్నాడు. ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.