పరువు, మర్యాద, సమాజంలో గౌరవం ప్రతి ఒక్కరు కోరుకొనేది. బంధువులు, స్నేహితుల మధ్య పరువు పోతుందని ఎంతో మంది దారుణాలకు ఒడిగట్టిన ఘటనలు ఉన్నాయి. మనం ఎంతో ప్రేమించేవారు మనల్ని అందరిముందు అవమానిస్తే అంతకు మిచ్చిన మరణం ఉండదు. ఇదే అనుకున్నాడు ఒక భర్త.. భార్య తన స్నేహితుల ముందు, బంధువుల ముందు తనను అవమానించడంతో తట్టుకోలేని అతను విషం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన పూణెలో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. పూణెకు చెందిన ప్రకాశ్ శంభాజీ చౌగులే, స్నేహాల్ ప్రకాశ్ చౌగులే భార్యాభర్తలు. పెళ్లైన కొద్దిరోజులు బాగానే ఉన్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఇక ఈ క్రమంలోనే ప్రకాశ్ శంభాజీ ఇటీవల ఒక పార్టీకి భార్యతో కలిసి వెళ్లాడు. అక్కడ భార్య తన భర్త గురించి ఘాటు ఆరోపణలు చేసింది. దాంతో అతని బంధువులు, స్నేహితులు అందరు అతనిని చూసి నవ్వుకున్నారు. అందరిముందు తన పరువు పోయిందని ఆవేదన చెందిన ప్రకాశ్ శంభాజీ దారుణమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇంట్లో ఎవరూలేని సమయంలో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో అతడిని హాస్పిటల్ కి తీసుకెళ్లగా అప్పటికే అతను మృతిచెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేపట్టారు.