Ganesh Visarjan 2025: సూర్యాపేట జిల్లా కోదాడలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఉద్రిక్తత చోటుచేసుకుంది. శోభాయాత్రలో పాల్గొన్న యువకుల మధ్య ఘర్షణ తలెత్తడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఘర్షణను అడ్డుకునేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌పై కొందరు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో కానిస్టేబుల్ తలకు తీవ్ర గాయాలు కావడంతో సహచర పోలీసులు వెంటనే ఆయనను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
Kakinada : వంగవీటి రంగ విగ్రహ వివాదంపై కాకినాడ కలెక్టర్‌తో మాట్లాడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఈ ఘటనతో కొంతసేపు శోభాయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు బలగాలు అదనంగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. పోలీసులపై దాడి చేసిన యువకులను గుర్తించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పోలీసులు తెలిపారు. శాంతియుతంగా జరగాల్సిన వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఇలాంటి సంఘటన జరగడం స్థానికులను ఆందోళనకు గురిచేసింది.