Karnataka: కర్ణాటకలోని యెల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. తన పెళ్లి ప్రపోజల్ తిరస్కరించిందనే కోపంతో 30 ఏళ్ల వివాహితను ఒక వ్యక్తి హత్య చేశాడు. మృతురాలు నిందితుడికి చిన్ననాటి స్నేహితురాలు. నిందితుడిని రఫీక్ ఇమాంసాబాగా గుర్తించారు. ఈ సంఘటన తర్వాత రఫీక్ అడవిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మృతురాలిని రంజిత బనసోడే, నిందితుడు స్కూల్ రోజుల నుంచి స్నేహితులు. పోలీసుల చెబుతున్న వివరాల ప్రకారం.. రంజిత సుమారు 12 ఏళ్ల క్రితం మహారాష్ట్రకు చెందిన సచిన్ కటేరాను వివాహం చేసుకుంది. వీరికి 10 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల మహిళ తన భర్తకు దూరంగా ఉంటోంది. యెల్లాపూర్‌లో తన కుటుంబంతో కలిసి నివసిస్తోంది. రంజిత ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం సహాయకురాలిగా పనిచేస్తోంది.
Read Also: Fraud : లక్ష్మీదేవి పూజలతో డబ్బులు డబుల్.. తండ్రీకొడుకులకు రూ. 50 లక్షల బురిడీ..!
నిందితుడు తరుచుగా భోజనం కోసం రంజిత ఇంటికి వెళ్లేవాడు. కానీ, రఫీక్ రంజితను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి పెంచాడు. దీనికి ఆమె, ఆమె కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో ఇద్దరి మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. తన లవ్ ప్రపోజల్, పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించడంతో కోపం పెంచుకున్న రఫీక్.. రంజిత పని నుంచి ఇంటికి వెళ్తుండగా పదునైన వస్తువుతో ఆమెపై దాడి చేశాడు.
ఘటన తర్వాత రఫీక్ అక్కడి నుంచి పారిపోగా, బాధితురాలిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మరణించింది. కొన్ని గంటల తర్వాత, రఫీక్ సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.