Hyderabad Businessman Trapped In Video Call Fraud: ఈమధ్య సైబర్ నేరగాళ్లు డబ్బులు దోచేసేందుకు ‘నగ్న వీడియో కాల్’ స్ట్రాటజీని తెగ ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో అజ్ఞాత వ్యక్తులతో అమ్మాయి పేరిట పరిచయాలు చేసుకోవడం, అవతల ఎవరో ఒక అమ్మాయి ద్వారా వీడియో కాల్స్‌లో నగ్నంగా మాట్లాడించడం, దాన్ని అడ్డం లక్షలు కాజేయడం వంటివి చేస్తున్నారు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలానే వస్తున్నాయి. తాజాగా మరో వ్యక్తి కూడా ఇలాగే అడ్డంగా బుక్కయ్యాడు. తాను సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నానన్న విషయాన్ని గ్రహించకుండా, అవతల అమ్మాయిని చూసి టెంప్ట్ అయ్యాడు. చివరికి, లక్షలకు లక్షలు ముట్టజెప్పాడు. అతడు పోలీసుల్ని ఆశ్రయించడంతో.. ఈ వ్యవహారం మొత్తం బయటపడింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో నివాసముండే ఒక ప్రముఖ వ్యాపారవేత్తకు ఇటీవల అంజనీశర్మ పేరుతో ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపింది. ప్రొఫైల్‌లో అమ్మాయి ఫోటో కనిపించగానే.. అతడు రిక్వెస్ట్‌ని యాక్సెప్ట్ చేశాడు. అంతేకాదు.. మెసేంజర్‌లో ‘హాయ్’ అంటూ మెసేజ్ కూడా పెట్టాడు. ఇక అప్పట్నుంచి ఇద్దరి మధ్య చాటింగ్ మొదలైంది. ఈ క్రమంలోనే వాట్సాప్ నంబర్లను కూడా ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ వెంటనే ఆ అమ్మాయి వీడియో కాల్ చేసి.. తన అందచందాలను చూపించింది. ఆ అమ్మాయి అందాల్ని చూసి అతడు మైమరిచిపోయాడు. మరుసటి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. అయితే.. ఈసారి వ్యాపారవేత్త కూడా నగ్నంగా తయారై, ఆ అమ్మాయితో వీడియో కాల్‌లో మాట్లాడాడు. ఇంకేముంది.. తమ చేతికి బకరా దొరికిపోయాడనుకొని, ఆ మొత్తం తతంగాన్ని సైబర్ నేరగాళ్లు రికార్డ్ చేసేశారు. ఆ వీడియోని అడ్డం పెట్టుకుని, ఆ యువతి అతడ్ని బ్లాక్‌మెయిల్ చేసింది.
అడిగినంత డబ్బులిస్తావా? లేక ఈ వీడియోని సోషల్ మీడియాలో లీక్ చేయనా? అని ఆ యువతి బెదిరించింది. ఆ వ్యాపారవేత్తకు సమాజంలో మంచి గుర్తింపు ఉంది కాబట్టి, వీడియో బయటకు వస్తే పరువు పోతుందన్న భయంతో.. ఆ అమ్మాయి అడిగినంత డబ్బులను పలు దఫాలుగా ఇస్తూ వచ్చాడు. అలా టోటల్‌లో రూ. 9 లక్షలు ఆ యువతికి సమర్పించుకున్నాడు. ఇంకా తనకు డబ్బులు కావాలని ఆ యువతి బెదిరింపులకు దిగడంతో.. ఇక చేసేదేమీ లేక ఆ వ్యాపారవేత్త పోలీసుల్ని ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ యువతిని ట్రాక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అన్నట్టు.. ఈ మొత్తం తతంగం కేవలం రెండు రోజుల్లోనే జరగడం గమనార్హం.