HYD STEROIDS ARREST: ఇన్‌స్టంట్ ఫిట్‌నెస్ పేరుతో వారి శరీరంలోకి స్టెరాయిడ్స్ ఎక్కిస్తున్నారు. కొందరి బలహీనతను కొంత మంది కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. అలాంటి స్టెరాయిడ్ మాఫియా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. జిమ్ సెంటర్లే అడ్డాగా.. వర్కవుట్లు చేసే కుర్రాళ్లే టార్గెట్‌గా ఈ దందా సాగుతున్నట్లు గుర్తించారు. బాడీ ఫిట్ అవుతుందని.. కండలు వస్తాయని మాయమాటలు చెప్పి ఈ ఇంజెక్షన్లను అంటగడుతున్నారు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు నిఘా పెట్టి, అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. నిందితుడిని రషీద్ మత్లూబ్ ఖాన్‌గా గుర్తించారు. అతని వద్ద నుంచి రూ.1.60 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, భారీగా సిరంజీలను స్వాధీనం చేసుకున్నారు. కనీసం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ గానీ, లైసెన్స్ గానీ లేకుండా కేవలం లాభాపేక్షతోనే ఈ దందా సాగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Read Also: Koragajja : కొచ్చిలో ‘కొరగజ్జ’ టీంకు ‘మెగా’ చేదు అనుభవం!
నిజానికి ఈ ఇంజక్షన్లు సాధారణంగా తక్కువ రక్తపోటు చికిత్సకు మాత్రమే వాడాల్సినవి. అయితే వాటిని బాడీ బిల్డింగ్ కోసం దుర్వినియోగం చేయడం వల్ల గుండెపోటు, కాలేయ సమస్యలు, ప్రాణాంతక ఆరోగ్య ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరించారు. స్టెరాయిడ్లు కొనుగోలు చేసిన కొంతమంది యువకులకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. అంతే కాకుండా తప్పనిసరిగా నిపుణులైన వైద్యులను సంప్రదించాలని సూచించారు. జిమ్‌లో కష్టపడకుండానే ఫలితం రావాలనుకునే యువత, ఈ ప్రమాదకరమైన మార్గాన్ని ఎంచుకుని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అసలు ఈ ఇంజెక్షన్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీటి వెనుక ఉన్న సూత్రధారులు ఎవరు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.