ఆ ఇద్దరు యువతులు చిన్నప్పటి నుంచి స్నేహితులు.. ఒకరిని ఒకరు వదిలి ఉండలేనంతగా పెరగక పోయినా ఒకరంటే ఒకరికి ఇష్టం. ఇలా ఉన్న ఆ ఇద్దరు జీవితంలోకి ఒక యువకుడు ప్రవేశించాడు. ప్రేమ పేరుతో ఇద్దరికి దగ్గరయ్యాడు. దీంతో అతడి వలన వీరి స్నేహం వైరంగా మారింది. ఎక్కడివరకు అంటే స్నేహితురాలిని కూడా చంపడానికి వెనకాడనంత.. ప్రేమించినవాడు తన స్నేహితురాలిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి ఆ యువతిపై దాడి చేసింది మరో యువతి.. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. శిడ్లఘట్ట తాలూకా ఆనేమడుగు గ్రామానికి చెందిన గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. ఎప్పుడు ఒకరిని ఒకరు వదిలి ఉండేవారు కాదు. ఇక ఈ క్రమంలోనే వీరికి గంగరాజు అనే యువకుడు పరిచయమయ్యాడు. ఒకరికి తెలియకుండా మరొకరికి మాయమాటలు చెప్పి ఇద్దరిని ప్రేమలోకి దించాడు. ఇద్దరు యువతులు అతడి ప్రేమ నిజమేనని నమ్మి పెళ్లికి కూడా సిద్ధమయ్యారు. ఇక ఇటీవల మౌనిక ఇంట్లో వీరి పెళ్లికి అంగీకరించడంతో వారిద్దరికీ వివాహం నిశ్చయమైంది. ఇక ఈ విషయం తెలుసుకున్న గంగోత్రి ఆవేశంతో ఊగిపోయింది. ఆదివారం డైరెక్ట్ గా మోనిక ఇంటికి వెళ్లి ఆమెపై కత్తితో దాడి చేసింది. దాడిలో మోనిక మెడకు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు గంగోత్రిని అరెస్ట్ చేశారు.