ఇవాళ హోలీ పండుగ. ఈ రంగుల పండుగ లాగే జీవితం కూడా రంగుల మయంగా వుండాలని, అంతా కలిసి జరుపుకుంటారు. అయితే అక్కడక్కడా కొందరు ఆకతాయిలు, మందుబాబులు హల్ చల్ చేశారు. కామారెడ్డి పట్టణంలోని అశోక్ నగర్ లో మందుబాబులు వీరంగం సృష్టించారు. హోలీ పండుగ సందర్భంగా ఇంట్లో మద్యం సేవించి రోడ్డుపైకి నానా గొడవ చేశారు. తమ చేతిలోని మద్యం సీసాలను జనంపైన విసిరేశారు, రోడ్డు వెంట వెళ్ళే వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
గాయాలపాలైన వారిలో ఒక మహిళ పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపుచేసే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడే వున్న మందుబాబులు ఏమాత్రం తగ్లేదు. పోలీసులపై కూడా దాడికి ప్రయత్నించడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. అంతకు ముందు మందుబాబులు చేసిన దాడిలో ఒక మహిళ తలకు గాయాలు కాగా, కాలనీలో డెలివరీకి వచ్చిన మరో రెండు వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు ఇద్దర్ని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారయ్యారు.