రోజురోజుకు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే టార్గెట్ చేసి అందినకాడికి దండుకుంటున్నారు. ఇలాంటి సంఘటనే హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అమీర్‌పేట మోతీనగర్‌కు చెందిన రైటర్డ్ ఉద్యోగి రామరాజుకు పలుమార్లు ముగ్గురు నిందితులు ఇన్సూరెన్స్ పేరుతో ఫోన్ చేసి, ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఒత్తిడి చేశారు. అంతేకాకుండా నమ్మలేనంత డబ్బువస్తుందంటూ నమ్మబలికి రామరాజు దగ్గర నుంచి పలు దఫాల వారీగా రూ.3.5 కోట్లు వసూలు చేశారు.
అయితే ఇన్సూరెన్స్ పత్రాలను అమెరికా నుండి రామరాజు కొడుకు చెక్ చేశాడు. అవి నకిలీ అని తేలడంతో.. మోసపోయామని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు బాధితుడు రామరాజు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేసిన సీసీఎస్ పోలీసులు..మూడు రోజుల్లోనే కేసును ఛేదించి నిందితుల అరెస్ట్ చేశారు. కరీంనగర్ కి చెందిన మనోజ్, వనపర్తికి చెందిన మహేష్ గౌడ్, గుడివాడ కి చెందిన సుబ్రహ్మణ్యంలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.