Hyderabad Keesara kidnap: వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు.. ప్రేమించుకున్నారు.. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కానీ పెద్దలు వారితో గొడవ పడ్డారు. తమ కూతురును.. అత్తింటి వారి నుంచి కిడ్నాప్ చేసి మరీ తీసుకు వచ్చారు. ఈ క్రమంలో పెద్ద ఘర్షణే జరిగింది. ఆమెను లాక్కుని వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ కీసరలో జరిగింది. ఆ యువకుడి పేరు ప్రవీణ్. అతను మేడ్చల్ జిల్లా నర్సంపల్లికి చెందిన యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ఇష్టపడి..పెద్దలను ఒప్పించేందుకు ప్రయత్నించారు. కానీ వీరిద్దరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అంతే కాదు తమ అమ్మాయిని కంట్రోల్‌లో పెట్టేందుకు ప్రయత్నించారు. కానీ ఎలాగోలా ఇద్దరూ ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు..
READ ALSO: Varundha Shopping Mall : కొత్తపేటలో వరుంధ షాపింగ్ మాల్ రెండవ బ్రాంచ్ ఘన ప్రారంభం
యువతి పేరేంట్స్ ఆమెపై కక్ష కట్టారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తిని వదిలేసి రావాలని పలుమార్లు ఒత్తిడి తెచ్చారు. అంతే కాదు పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా చేశారు. ఐతే కూతురు తాను ప్రేమించిన వాడిని వదిలే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. మరోవైపు పోలీసులను కూడా ఆశ్రయించారు యువతి తల్లిదండ్రులు. ఐతే ఇద్దరూ మేజర్లు కావడంతో.. పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు. కానీ ఎలాగైనా తమ కూతురును తమ ఇంటికి తీసుకు రావాలని యువతి పేరేంట్స్ భావించారు..
ఇదిగో ఇలా ప్రవీణ్.. ఇంటికి వెళ్లి గొడవ పెట్టుకున్నారు. చివరికి గొడవ పెరిగి పెద్దది కావడంతో తమ కూతురును బయటకు లాక్కుని వచ్చారు. అడ్డుకున్న ప్రవీణ్ కుటుంబ సభ్యుల కళ్లల్లో కారం చల్లారు. తమ కూతురును అడ్డదిడ్డంగా లాక్కుని వెళ్లి కారులో పడేశారు. అడ్డొచ్చిన వారిపై కర్రలు, బండరాళ్లతో దాడి చేశారు. కారులో అమ్మాయిని తీసుకుని వెళ్లిపోయారు.. ఈ ఘటనపై కీసర పోలీస్ స్టేషన్‌లో యువతి భర్త ప్రవీణ్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ ఇంట్లో ఉన్న సీసీ పుటేజీ స్వాధీనం చేసుకున్నారు.
READ ALSO: Cancer: ప్రమాదకరమైన రోగం.. కనిపించే ప్రథమ లక్షణం.. గుర్తించకపోతే ఇక అంతే సంగతులు!