Karnataka: కర్ణాటకలోని చిక్కమగళూర్‌లో జరిగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్త మరణించడం, ఆ రాష్ట్రంలో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. శుక్రవారం జిల్లాలోని రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో కాంగ్రెస్ కార్యకర్త, గ్రామ పంచాయతీ సభ్యుడు మృతి చెందినట్లు పోలీసులు శనివారం తెలిపారు. బ్యానర్ విషయంలో జరిగిన వివాదంలో గణేష్ గౌడ(38) మరణించాడు. శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో కల్మాదేశ్వర మఠం రోడ్డు సమీపంలో గణేష్‌పై పదునైన ఆయుధాలతో దాడి జరిగింది. నిందితుల్లో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.
Read Also: Sankranthiki Vasthunnam : సంక్రాంతికి వస్తున్నాం పార్ట్-2: షూటింగ్ అప్‌డేట్ వచ్చేసింది!
రెండు గ్రూపుల కూడా చిక్కమగళూర్ పట్టణంలోని ఒక బార్ వద్ద గొడవ పడ్డాయి. ఆ తర్వాత ఈ ఘర్షణ తీవ్రమైంది. రెండు వైపుల నుంచి చాలా మంది గాయపడ్డారు. వీరందర్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన వారిని కనిపెట్టేందుకు నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని పోలీసు సూపరింటెండెంట్ విక్రమ్ అమాథే తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జిల్లా పోలీసుల నుంచి వివరాలు కోరారు. గణేష్ గౌడ హత్యను సీఎం ఖండించారు.