అతడో ఆర్మీ జవాన్.. ఎంతోమందికి ఆదర్శంగా నిలవాల్సిన వ్యక్తి.. విధులు పూర్తిచేసుకొని ఏడాదికి ఒకసారి ఇంటికి వచ్చి భార్యాపిల్లలతో సరదాగా గడపకుండా దారుణానికి ఒడిగట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ భార్యాపిల్లలను వేధించడం మొదలుపెట్టాడు. పిల్లలకు మంచి బుద్దులు నేర్పించాల్సిన వాడే, వారిముందు భార్యను బెల్టుతో చితకబాదాడు. భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య అందరు నిద్రపోతుండగా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని పిల్లలను అనాధలుగా వదిలేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసింది.
వివరాలలోకి వెళితే.. ఉత్తరప్రదేశ్ కి చెందిన సత్యవీర్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్ జవానుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడికి కొన్నేళ్ల క్రితం మీరా అనే మహిళతో వివాహమైంది. వీరికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే తండ్రి కోసం పిల్లలు ఎంతగానో ఎదురుచూస్తుండేవారు. ఇక ఇటీవల సెలవుల మీద వచ్చిన సత్యవీర్.. భార్యాపిల్లలతో సంతోషంగా గడపడం మానేసి వారిని వేధించడం మొదలుపెట్టాడు. నిత్యం మద్యం సేవిస్తూ భార్యను చిత్రహింసలకు గురిచేసేవాడు. కనీసం పిల్లలు చూస్తున్నారనే విచక్షణ మరిచి భార్యను బెల్టుతో చర్మం వుండేలా కొట్టేవాడు. ఇక తాజాగా శనివారం రాత్రి కూడా తాగిన మత్తులో భార్యను చితకబాది నిద్రపోయాడు.
భర్త చిత్రహింసలు తట్టుకోలేని భార్య మీరా పిల్లలను నిద్ర పుచ్చి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఉదయం పిల్లలు లేచి చూసేసరికి తల్లి ఫ్యాన్ కి విగతజీవిగా వేలాడడంతో వారు భయంతో కేకలు వేశారు. వారి కేకలు విన్న చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని జవాన్ ని అరెస్ట్ చేయబోతుండగా .. అతడు పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడిని మత్తు దిగేవరకు గదిలో బంధించి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భర్తే హత్య చేసి, ఆత్మహత్య గా సృష్టించాడన్న వాదనలు వినిపించడంతో ఆకోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు.