Live Location: బెంగళూర్‌లో ఒక మహిళ హత్య, ఆమె డెడ్‌బాడీని కనుగొనేందుకు పోలీసులకు ‘‘లైవ్ లొకేషన్’’ సాయపడింది. హత్యకు కొన్ని నిమిషాల ముందు సదరు మహిళ ఆమె స్నేహితురాలికి పంపిన లొకేషన్ కీలకంగా మారింది. వివరాల్లోకి వెళ్తే, లలిత అలియాస్ దివ్య తన స్నేహితురాలికి పెట్టిన లైవ్ లొకేషన్ ఆమె మృతదేహాన్ని కనుగొనేందుకు సాయపడింది. రామనగర జిల్లా మగాడి హుజగల్ కొండ అటవీ ప్రాంతలోని గోతిలో 32 ఏళ్ల బ్యూటీషియన్‌ని పూడ్చిపెట్టారు.
Read Also: USA: ల్యాండింగ్ సమయంలో షాకిచ్చిన పైలట్.. హడలెత్తిపోయిన ప్రయాణికులు
ట్రావెల్ ఏజెన్సీలో పనిచేస్తున్న లలిత భర్త ఉమేష్ డ్రగ్స్‌కి బానిసయ్యాడు. దీంతో అతడిని విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైంది. విడాకుల కోసం పత్రాలపై సంతకాలు చేసేందుకు ఉమేష్ లలితని నమ్మించి గుడికి రమ్మన్నాడు. ఆమె తన స్నేహితురాలు ఉమ టూవీలర్ తీసుకుని ఉమేష్ రమ్మని చెప్పిన ప్రదేశానికి వెళ్లింది. ఎందుకో ఇతని నడవడికపై అనుమానం కలిగిన లలిత తన లైవ్ లొకేషన్‌ని ఉమతో పంచుకుంది. ఆ తర్వాత ఉమని ఉమేష్ హత్య చేశాడు. హత్య సోమవారం సాయంత్రం 4 గంటల నుంచి 11 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది.
హత్య జరిగిన తర్వాత ఉమేష్, బైకుని ఉమకి ఇచ్చి, లలితని బస్టాప్‌లో దింపినట్లు చెప్పాడు. అయితే అనుమానం కలగడంతో ఉమ, ఉమ భర్త బలరాజు మాగుడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం అడవిలో లలిత మృతదేహాన్ని గుర్తించేందుకు పోలీసులు లైవ్ లొకేషన్‌ను ఉపయోగించారు. ఉమేష్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విచారణ నిమిత్తం ఇతడి ముగ్గురు సహచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ ఉన్న లారీలో లలిత ఫోన్‌లు పారవేసినట్లు గుర్తించారు. ఉమ కాల్ చేసిన తర్వాత సంఘటన గురించి తెలుసుకున్నామని, లలిత వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించామని, అయితే అప్పటికే ఆమె ఫోన్‌లు ఆఫ్‌లో ఉన్నాయని ఆమె బావ మారుతి వెల్లడించారు.