సమాజంలో జరిగే కొన్ని ఘటనలు చూసినప్పుడు మనం ఇంకా ఏ కాలంలో బ్రతుకుతున్నాం అనిపించకమానదు. ఆ ఘటనలు విన్నప్పుడు కడుపు రగిలిపోతూ ఉంటుంది. తాజాగా అలాంటి ఒక ఘటనే పెద్దిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది. కన్నబిడ్డలపై ఒక తండ్రి అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. ప్రపంచం రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతుంటే.. ఈ రాక్షసుడు మాత్రం క్షుద్ర పూజల పేరుతో చిన్నారిని బలితీసుకున్నాడు.
వివరాల్లోకి వెళితే.. పెద్దిరెడ్డిపల్లి చెందిన వేణు కుటుంబంతో సహా కలిసి నెల్లూరు జిల్లాలోని పెద్దిరెడ్డిపల్లిలో నివాసముంటున్నాడు. అతనికి 12 ఏళ తర్వాత పూర్విక, పునర్విక(4) కవల పిల్లలు జన్మించారు. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన కూతుర్లను తన మూఢ నమ్మకాలకు బలిచేశాడు. గతకొన్నిరోజులుగా అతడి జీవితంలో అనుకోని సంఘటనలు జరుగుతున్నాయి. దీంతో మనస్థాపానికి గురైన వేణు.. ఆ బాధలు తొలిగిపోవాలంటే శాంతి హోమం చేయాలనీ అనుకున్నాడు. వెంటనే ఇంట్లో తలుపులు మూసేసి హోమానికి ఏర్పాట్లు చేసి తన ఇద్దరు కూతుళ్లను ఎదురుగా కూర్చోపెట్టి హోమం మొదలుపెట్టాడు. అనంతరం ఇద్దరు పిల్లలో నోటిలో కుంకుమ పోసి గొంతు నులిమాడు.
పిల్లలు గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు ఇంటి తలుపులు కొట్టడంతో చిన్నారులను అక్కడే వదిలి వేణు పరారయ్యాడు. తలుపులు బద్దలుకొట్టి వచ్చిన వారికి చావుబతుకుల మధ్య చిన్నారులు కనిపించారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఇక స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు పరారీలో ఉన్న వేణును వెతికి పట్టుకొని అరెస్ట్ చేశారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం చిన్నారుల్లో ఒక చిన్నారి ఉదయం మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇకపోతే వేణు పూజలు ఎందుకు చేశాడు.. అవి శాంతి పూజలా..? లేక క్షుద్ర పూజలా..? అనేది తెలియాల్సి ఉంది. అసలు అలా పూజలు చేయాలని వేణుకు ఎవరు చెప్పారు అనేది పోలీసులు విచారిస్తున్నారు.