డబ్బు.. ప్రపంచాన్ని నడిపిస్తోంది.. కాదు కాదు శాసిస్తోంది. రక్త సంబంధాలు, మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఆస్తికోసం కన్నబిడ్డలు కన్న తల్లిదండ్రులను హతమారుస్తున్నారు. తాజాగా ఇద్దరు కొడుకులు.. ఆస్తి గొడవల్లో కన్నతండ్రిని అతి దారుణంగా పొడిచి చంపారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే.. మండ్య జిల్లాలోని శ్రీరంగ పట్టణం తాలూకాలోని కరెమేగళకొప్పలు గ్రామంలో మరికాళయ్య కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతడికి ఇద్దరు కొడుకులు శశికుమార్, రాజేష్. ఇద్దరు కొడుకులకు పెళ్లిళ్లు చేసి ఒక దారి చేసిన మరికాళయ్య ఇటీవల డబ్బు అవసరమై తనకున్న భూమిలో ఎకరా భూమిని రూ.30 లక్షలకు అమ్మాడు. ఆ అమ్మిన సొమ్మును కొడుకులిద్దరికి సమానంగా పంచుతానని తెలిపాడు. అయితే ఆస్తిపై కన్నేసిన కొడుకులు తండ్రికి తెలియకుండా భూమి కొన్నవారి వద్దకు వెళ్లి రూ.30 లక్షలు తమకే వచ్చే విధంగా మాట్లాడుకున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న తండ్రి మరికాళయ్య రిజిస్ట్రేషన్ రోజున సంతకం పెట్టలేదు. దీంతో కోపంతో రగిలిపోయిన ఆ కొడుకులు తండ్రిపై గొడవకు దిగారు. ఆ గొడవలో కొడుకులు కసాయిల్లా మారి కన్నతండ్రిని కత్తితో పొడిచిపొడిచి హతమార్చారు. ఈఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న కొడుకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.