భార్యాభర్తలు అన్నాక గొడవలు పడడం సహజం.. వాటన్నింటిని సర్దుకొని కాపురం చేస్తేనే కుటుంబం నిలబడుతుంది. కానీ .. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఎక్కువమంది కుటుంబ కలహాల వలన నేరాలకు పాల్పడుతున్నారు. ఆ బాధలను భరించలేక వారు మృతి చెందడమో, లేక కట్టుకున్నవారిని కడతేర్చడమో చేస్తున్నారు. తాజాగా ఒకభర్త, భార్య గొడవపడి వెళ్లిపోయిందని ఆమెపై నడిరోడ్డుపై యాసిడ్ దాడి చేశాడు.. పక్కనే ఉన్న కూతురుపై కూడా అతి కిరాతకంగా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ దారుణ ఘటన కేరళలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే.. కేరళలో నివాసముండే సనాల్ , నిజిత దంపతులకు అలకనంద అనే కూతురు ఉంది. అయితే భార్యాభర్తల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భర్త వేధింపులు తాళలేక నెల రోజుల క్రితం కన్నూరులోని కొట్టియూర్ నుంచి నిజిత, ఆమె కూతురు అంబలవాయల్ వచ్చి విడిగా ఉంటుంది. ఇక ఈ క్రమంలో నిన్న మధ్యాహ్నం కూతురుతో పాటు నిజిత బయటికి వెళ్లగా.. బైక్ పై వచ్చిన సనాల్ భార్యపై యాసిడ్ పోశాడు , కన్నకూతురని కూడా లేకుండా ఆమెపై కూడా యాసిడ్ పోసి పరారయ్యాడు. ఈ ఘటనలో తల్లీకూతుళ్లు ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలుపుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.