ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. అలా రూపొందిన చిత్రమే ఈ ‘మంచిరోజులు వచ్చాయి’. యువి క్రియేషన్స్ భాగస్వామి కావడం, దర్శకుడు మారుతి దర్శకత్వం వహించటంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగి థియేటర్ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ తరహా చిత్రాలకు సరిగ్గా సరిపోయే హీరో సంతోష్ శోభన్. ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. మరి దీపావళి కానుకగా వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.
పద్మ (మెహ్రీన్), సంతోష్ (సంతోష్ శోభన్) బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉద్యోగులు. వీరిద్దరూ లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంటారు. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అందుబాటులోకి రావటంతో హైదరాబాద్ వస్తారు. పద్మ తండ్రి గోపాలం (అజయ్ ఘోష్) జీవితాన్ని సంతోషంగా గడుపుతుంటాడు. అయితే గోపాలం పొరుగున నివసించే ఇద్దరు వ్యక్తులు తన కూతురిపై సందేహం కలిగేలా చేసి, అతని ఆనందాన్ని దూరం చేయాలని చూస్తుంటారు. కూతురు ప్రేమలో పడి మోసపోతోందంటూ మనశ్శాంతి కోల్పోయేలా చేస్తారు. ఆ తర్వాత గోపాలంకి దూరమైన సంతోషాన్ని సంతోష్ తిరిగి దక్కేలా చేస్తాడా? పొరుగు వారి నిజ స్వరూపాన్ని గోపాలం గ్రహిస్తాడా? అన్నదే ఈ సినిమా.
సినిమాకి కర్త, కర్మ, క్రియ అజయ్ ఘోష్ పోషించిన తండ్రి పాత్ర. కూతురిని అమితంగా ప్రేమించే తండ్రిగా అజయ్ ఘోష్ చక్కటి ప్రతిభను కనబరిచాడు. ఇక ఈ సినిమాలో హీరో సంతోష్ శోభన్ నీట్ గా కనిపించటమే కాదు ముందు సినిమాలకంటే చక్కటి నటనను ప్రదర్శించాడు. పద్మగా మెహ్రీన్ సోసో. ఇతర నటీనటులలో చెప్పుకోవాల్సింది ప్రవీణ్ ఒక్కడినే. ‘వెన్నెల’ కిషోర్ పాత్ర పరమ రొటీన్ గా ఉంది. ఇక సప్తగిరి పాత్ర ఎందుకు పెట్టారో దర్శకనిర్మాతలకే తెలియాలి. గోపాలం ఫ్రెండ్స్ పాత్రలు, వాటి నడవడిక చిరాకు తెప్పిస్తాయి.
గతంలో దర్శకుడు మారుతి ట్రాక్ రికార్డ్ చూసి సినిమాకు వచ్చిన వారికి పూర్తి నిరాశను కలిగించే చిత్రమిది. ‘ప్రేమకథా చిత్రమ్’, ‘భలే భలే మగాడివోయ్’, ‘ప్రతి రోజు పండగే’ వంటి సినిమాలతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసిన మారుతి ఈ సినిమాలో ఆ స్థాయి వినోదాన్ని పంచటంలో విఫలం అయ్యాడు. తక్కువ వ్యవధిలో పరిమిత బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది. అక్కడక్కడ అడల్డ్ కామెడీ ఛాయలు కూడా కనిపిస్తాయి. నిజానికి లైన్ గా చెప్పాలంటే ‘చెరపకురా చెడేవు’ అన్నదే ఈ సినిమా కథ. దానికి ఆడపిల్లలపై అనుమానం అనే ట్రాక్ జోడించి పరమ చీప్ గా మార్చేశారు. సినిమా ఆసాంతం అతి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు, సాయి శ్రీనివాస్ కెమెరా పనితనం బాగన్నాయి. అనూప్ కంపోజ్ చేసిన పాటల్లో ఒకటి రెండు బాగున్నాయి. ప్రవీణ్ అప్పడాల విజయలక్ష్మి ట్రాక్ అక్కడక్కడా నవ్వులు పండించింది. ఓవరాల్ గా మాత్రం మంచిరోజులు రాలేదు.
ప్లస్ పాయింట్స్:
అక్కడక్కడా పండిన కామెడీ
సినిమాటోగ్రఫీ
నిర్మాణవిలువలు
మైనస్ పాయింట్స్:
ఆకట్టుకోని కథ, కథనం
వెకిలి కామెడీ
టోటల్ లాజిక్ మిస్
రేటింగ్: 2.25 / 5
ట్యాగ్ లైన్: మంచిరోజులు రాలేదు!