వివాహం, విడాకుల కథాంశాలతో తెలుగులో చాలానే చిత్రాలు వచ్చాయి. అంతేకాదు… సహజీవనం నేపథ్యంలో కూడా! పెద్దలు కుదిర్చిన పెళ్ళి చేసుకున్న ఓ జంట, లివ్ ఇన్ రిలేషన్ లో ఉన్న మరో జంట… వీరి ప్రయాణం ఎటు నుండి ఎటువైపుకు దారి తీసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మ్యాడ్’. ఇక్కడ ‘మ్యాడ్’ అంటే పిచ్చి మాత్రమే కాదు… ఈ ఎం.ఎ.డి. కి అబ్రివేషన్ ‘మ్యారేజ్ అండ్ డైవోర్స్’ అని కూడా! లక్ష్మణ్ మేనేని దర్శకత్వంలో టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి నిర్మించిన ‘మ్యాడ్’ మూవీ జనం ముందుకు వచ్చింది.
కథ విషయానికి వస్తే… మాధవ్ (మాధవ్ చిలుకూరి), అరవింద్ (రజత్ రాఘవ్) ప్రాణ స్నేహితులు. మాధవ్ బిజినెస్ మాగ్నెట్ కొడుకు. కనిపించిన అమ్మాయినల్లా ఫ్లర్ట్ చేస్తూ బాధ్యతలు పట్టకుండా తిరుగుతుంటాడు. సెన్సిటివ్ గా ఉండే పెయింటర్ మాధురి (స్పందన పల్లి)తో అతనికి పెద్దలు వివాహం చేస్తారు. షాయరీలతో టైమ్ పాస్ చేసే అరవింద్ బిహేవియర్ నచ్చి అఖిల (శ్వేతవర్మ) అతనితో లివ్ ఇన్ రిలేషన్ షిప్ మొదలు పెడుతుంది. అయితే కొద్ది రోజుల్లోనే ఈ రెండు జంటల మధ్య విభేదాలు తలెత్తాయి. విడాకుల కోసం మాధవ్, మాధురి కోర్టును ఆశ్రయిస్తే; అరవింద్ ప్రవర్తనతో విసిగిపోయిన అఖిల అతన్ని వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ రెండు జంటలు తిరిగి ఎలా ఒక్కటి అయ్యాయన్నదే మిగతా కథ.
‘మ్యాడ్’ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో విడుదల కావడమే కుర్రకారుని కిర్రెక్కించింది. గాఢ చుంబనాలు, బిగి కౌగిళ్ళతో ఇది నిజంగా పిచ్చెక్కించే మూవీ అనే ఒపీనియన్ ను క్రియేట్ చేసింది. బహుశా ఆ మాత్రం అడల్ట్ కంటెంట్ ను ట్రైలర్ లో చూపించకపోతే, జనాలు చర్చించుకోరని, థియేటర్లకు రారని దర్శక నిర్మాతలు భావించొచ్చు. కానీ గ్రహించాల్సిన విషయం ఏమంటే… అంతకంటే దారుణమైన కంటెంట్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో లభిస్తుంటే… పనికట్టుకుని థియేటర్లకు కేవలం హాట్ కంటెంట్ కోసం ఎందుకు వస్తారు? అని! సో… కథలో దమ్ముతో పాటు కథనం ఆసక్తికరంగా ఉంటే… చిన్న సినిమా అయినా థియేటర్ లో చూడటానికి జనం ఎగబడతారు. అలాంటి సినిమాలలో స్టార్స్ నటించాల్సిన అవసరం కూడా లేదు. ఈ సత్యం దర్శక నిర్మాతలకు ఎప్పటికి బోధ పడుతుందో తెలియదు. ‘మ్యాడ్’ సినిమా విషయంలోనూ అదే జరిగింది. ఎంచుకున్న కథ మంచిదే… చిన్నపాటి అపోహల కారణంగా అరేంజ్డ్ మ్యారేజెస్, లివ్ ఇన్ రిలేషన్స్ ఎలా బెడిసి కొడుతున్నాయో చూపించారు. కాస్తంత ఓర్పుతో, సహనంతో ప్రవర్తిస్తే… జీవితాలు ఆనందమయం అవుతాయని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ సినిమా ప్రథమార్ధం అంతా మరీ ‘బి’ గ్రేట్ మూవీని తలపించే సన్నివేశాలతో నిండిపోయింది. అవసరానికి మించిన ఎక్స్ పోజింగ్ అండ్ ఎరోటిక్ సీన్స్ తో సాగిపోయింది. ద్వితీయార్ధంలో కథ గాడిన పడుతుంది. రెండు జంటలు తమ సమస్యలకు పరిష్కారం వెదుక్కోవడంతో కథ సుఖాంతమౌతుంది. అయితే… వీరు విడిపోవడానికి, తర్వాత తిరిగి కలవడానికి బలమైన, హృదయానికి హత్తుకునే సన్నివేశాలను దర్శకుడు రాసుకోలేకపోయాడు. లవ్ మేకింగ్ సీన్స్ మీద చూపించిన శ్రద్ధ, వాళ్ళ రీ-యూనియన్ సీన్స్ పై చూపించలేకపోయాడు.
మాధవ్, మాధురి జంట బాగుంది. ఆ పాత్రల్లో మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి చక్కగా నటించారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్ తెరకెక్కించిన ‘శ్రీవల్లి’ మూవీ ఫేమ్ రజిత్ రాఘవ్.. ఇందులో అరవింద్ పాత్రను పోషించాడు. అక్కడక్కడా బాగానే చేశాడు. ఈ ముగ్గురిలో కాస్తంత అనుభవం ఉన్న నటి శ్వేత వర్మ. ఇప్పటికే పలు చిత్రాలలోనూ, వెబ్ సీరిస్ లోనూ నటించింది. శృంగార సన్నివేశాలలో పాత్ర పరిధిని దాటి అభినయించిందని చెప్పాలి. మిగిలిన ఆర్టిస్టులలో తెలిసిన ముఖాలు తక్కువే. ఈ సినిమాకు ప్రధాన బలం నటీనటుల కంటే… సాంకేతిక నిపుణులు. మోహిత్ రెహ్మానియన్ ప్రాణం పెట్టి సంగీతం సమకూర్చాడనిపిస్తుంది. పాటల బాణీలు, నేపథ్య సంగీతం బాగున్నాయి. ముఖ్యంగా ప్రముఖ గాయనీ గాయకులతో వాటిని పాడించడంతో వినసొంపుగా ఉన్నాయి. ఇక ద్వితీయార్థంలో వచ్చే సూఫీ గీతం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ. లక్ష్మీ ప్రియాంక రాసిన గీతాలు భావయుక్తంగా ఉన్నాయి. రఘు మందాటి సినిమాటోగ్రఫీ బాగుంది. సీనియర్ ఎడిటర్ మార్తండ్ కె. వెంకటేశ్ ఈ మూవీకి పని చేయడం ప్లస్ పాయింట్. అయితే… కొంతలో కొంత శృంగార సన్నివేశాల నిడివి తగ్గించి ఉండాల్సింది. అలా చేయకపోవడం వల్లే ‘మ్యాడ్’ పెద్దలకు మాత్రమే పరిమితమైన చిత్రంగా మారిపోయింది. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగు పెట్టిన వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి ప్రొడక్షన్ పరంగా రాజీ పడలేదు కానీ ఎంచుకున్న కథ, కథనాలే ఈ సినిమాను ఓ వర్గానికే పరిమితం చేసేశాయి.
రేటింగ్ : 2.25 / 5
ప్లస్ పాయింట్స్
మేకింగ్ వాల్యూస్
సంగీతం, కెమెరాపనితనం
మైనెస్ పాయింట్స్
ఆసక్తి కలిగించని సన్నివేశాలు
ఆకట్టుకోని కథనం
ఓవర్ మసాలా సీన్స్
ట్యాగ్ లైన్: ఇదోరకం ‘మ్యాడ్’నెస్!