గత యేడాది ఎయిర్ డెక్కన్ అధినేత జి. ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా ‘సూరారై పొట్రు’ చిత్రాన్ని చేసిన తమిళ స్టార్ హీరో సూర్య, ఇప్పుడు అదే రాష్ట్రానికి చెందిన మానవ హక్కుల న్యాయవాది చంద్రు స్ఫూర్తితో ‘జై భీమ్’ చిత్రాన్ని చేశారు. లివింగ్ లెజెండ్స్ అయిన వీరిరువురి పాత్రలను పోషించడానికి సూర్య ముందుకు కావడం ఒక ఎత్తు అయితే, ఆ చిత్రాలను తనే స్వయంగా నిర్మించడం మరో ఎత్తు. ‘సూరారై పొట్రు’ గత యేడాది దీపావళికి రెండు రోజుల ముందు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాగా, తాజా చిత్రం ‘జై భీమ్’ ఈ యేడాది దీపావళి కానుకగా 2వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతోంది.
ఇది 1995లో జరిగిన ఓ యథార్థ ఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమా. దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు యాభై సంవత్సరాలు గడిచినా ఎంతోమంది గిరిజనులు ఓటు హక్కు లేకుండా, ఉండటానికి పట్టా భూమి లేకుండా, కనీసం రేషన్ కార్టు లేకుండా బతుకుతున్నారు. కొండకోనల్లో జీవితం సాగించే వారంటే అందరికీ అలుసే. వారిని ఆదుకునే వారు లేకపోవడంతో ఏదో ఒక తప్పుడు కేసును వారి మీద బనాయించి ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గేలా పోలీసులు చేస్తుంటారు. రాజకీయ ఒత్తిడిలను తట్టుకోవడానికి పోలీసు అధికారులు ఈ గిరిజనులను పావులుగా ఉపయోగించుకుంటారు. అలా పోలీసుల కుట్రకు బలి అయిన రాజన్న (మణికందన్) అనే గిరిజనుడి కుటుంబానికి సంబంధించిన కథ ఇది. తమ గూడెం దగ్గరలోని గ్రామపెద్ద ఇంటిలోని పామును పట్టడానికి ఓసారి రాజన్న వెళతాడు. ఆ తర్వాత ఆ ఇంటిలోని, డబ్బు, నగలు పోతాయి. ఆ నేరం రాజన్న మీద మోపి, అతన్ని జైల్లో పెడతారు. చేయని నేరానికి అతన్ని చిత్ర హింసలకు గురిచేస్తారు. ఆ తర్వాత కొద్ది రోజులకే రాజన్న, అతనితో పాటు అరెస్ట్ చేసిన మరో ఇద్దరు ఖైదీలు జైలు నుండి పారిపోయారని పోలీసులు చెబుతారు. అప్పటికే గర్భవతి అయిన రాజన్న భార్య చిన్నతల్లి (లిజోమోల్ జోస్) మానవహక్కుల కార్యకర్త మిత్ర (రజిష విజయన్) సాయంతో లాయర్ చంద్రు (సూర్య) ను కలుస్తుంది. హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ వేసి చంద్రు తీగలాగే ప్రయత్నం చేస్తాడు. దాంతో పోలీసు వ్యవస్థ డొంక కదులుతుంది. రాజన్నను వెతికే విషయంలో చిన్నతల్లికి చంద్రు సాయం చేయగలిగాడా? అమాయక గిరిజనులను అకారణంగా హింసించే పోలీస్ లకు బుద్ధి వచ్చేలా చేశాడా? చట్టాన్ని విశ్వసించే చంద్రుకు కోర్టులో న్యాయం లభించిందా? అనేది మిగతా కథ.
తమిళనాడుకు చెందిన లాయర్ చంద్రు మానవహక్కుల న్యాయవాదిగా మంచి గుర్తింపు పొందారు. ఒక్క పైసా కూడా ఫీజు తీసుకోకుండా ఆయన అభాగ్యుల పక్షాన నిలిచి కోర్టులో పోరాటం చేశారు. వేలాది కుటుంబాల్లో ఆయన కారణంగా వెలుగు నిండింది. ఆయన చేపట్టిన ఓ కేసును ఆధారంగా చేసుకునే టి.జె. జ్ఞానవేల్ ఈ కథను రాసుకున్నారు. ఈ కథలో నిజాయితీ ఉండటంతో సూర్య నటించడానికి, సినిమా నిర్మించడానికి ముందుకొచ్చారు. గిరిజనుల స్థితిగతులను, వారిపై పోలీసుల అరాచకాన్ని దర్శకుడు జ్ఞానవేల్ కళ్ళకు కట్టినట్టు చూపించాడు. సినిమా ప్రారంభంలోనే తప్పుడు కేసుల్లో అమాయకులను, మరీ ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారిని పదేపదే ఎలా ఇరికిస్తారో చూపించాడు. నిజాయితీతో మెలిగే గిరిజనులను సైతం తక్కువ కులం వారనే కారణంగా ఎలా ఉన్నత వర్గాలు టార్గెట్ చేస్తుంటాయో తెలిపాడు. అధికార మదంతో పోలీసులు ఒక్కోసారి తాము చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారనే సత్యాన్ని చూపారు.
సినిమా ప్రారంభమైన అరగంటకు కానీ సూర్య పోషించిన చంద్రు పాత్ర తెరమీదకు రాదు. అక్కడ నుండి మూవీ చకచకా సాగిపోతుంది. హెబియస్ కార్పస్ పిటీషన్ కోర్టులో వేయడం, అక్కడ జరిగే విచారణ, పోలీసులు తప్పుల మీద తప్పులు చేయడం, వారి వంచనను కనిపెట్టడానికి సూర్య పల్లెలు పట్టి తిరగడం, ఐజీ స్థాయి అధికారితో ఓ కమిషన్ వేయించడం, ఆయన చేసే ఎంక్వయిరీతో మూవీ ఆసక్తికరంగా సాగుపోతుంది. అయితే గతంలోనూ పోలీసులు, లాకప్ డెత్స్ నేపథ్యంలో తమిళంలో కొన్ని సినిమాలు వచ్చాయి. పోలీసుల దుష్టచర్యల దగ్గర ఆగిపోకుండా దీనికి కోర్టు డ్రామాను జత చేయడం విశేషం. అదే ఈ సినిమాకు ఆయువు పట్టు.
నటీనటుల విషయానికి వస్తే లాయర్ చంద్రు పాత్రకు సూర్య ప్రాణం పెట్టాడు. ఎక్కడా అతి అనేది లేకుండా చాలా బాలెన్డ్స్ గా ఆ పాత్రను పోషించాడు. గిరిజన దంపతులుగా మణికందన్, లిజోమోస్ జోస్ ఆ పాత్రల కోసం ప్రాణం పెట్టారు. వారి కుటుంబ సభ్యులుగా నటించిన వారూ తమ పాత్రల్లో చక్కగా ఒదిగిపోయారు. విద్యావాలంటరీ మిత్రగా రజిష విజయన్ చక్కగా నటించింది. అడ్వకేట్ జనరల్ గా రావు రమేశ్, ఐజీ పెరుమాళ్ స్వామిగా ప్రకాశ్ రాజ్ చేశారు. అయితే ప్రకాశ్ రాజ్ కు వేరే వారితో డబ్బింగ్ చెప్పించడం అంతగా నప్పలేదు. వాయిస్ తో ఫెమిలియర్ అయిన వ్యక్తుల విషయంలో ఇలా చేయకుండా ఉంటే బాగుండేది. జడ్జి పాత్రలో సంజయ్ స్వరూప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పాత్రలో గురు సోమసుందరం మెప్పించారు. సీన్ రోల్డాన్ స్వర రచన, నేపథ్య సంగీతం బాగున్నాయి. ఎస్. ఆర్. కదీర్ తన సినిమాటోగ్రఫీ తో మనల్ని ఆయా ప్రదేశాలలో ప్రత్యక్ష సాక్షులుగా నిలబెట్టిన అనుభూతిని కలిగించాడు. అయితే సినిమా నిడివి విషయంలో కాస్తంత జాగ్రత్త పడాల్సింది. ఈ మధ్య కాలంలో కోర్డు డ్రామా నేపథ్య చిత్రాలు చాలానే వచ్చాయి. అలానే ఇదే తరహా కథాంశంతోనూ గతంలో కొన్ని చిత్రాలు వచ్చాయి. కాబట్టి ఇదో కొత్త కథ అని గానీ, కొత్తగా తీశారని గానీ అనుకోవడానికి వీలులేదు. అయితే సూర్య వంటి ఇమేజ్ ఉన్న స్టార్ ఇలాంటి ఆలోచనాత్మక చిత్రంలో నటించడం, నిర్మించడం అభినందించదగ్గది. ప్రతి న్యాయవాది, బాధ్యత గల ప్రతి పౌరుడు చూడాల్సిన సినిమా ఇది. ఇలాంటి సినిమాలు అప్పుడప్పుడైనా వస్తే, మన సమాజంలో అట్టడుగు వర్గాలకు ఎలాంటి అన్యాయం జరుగుతోంది మిగిలిన వారికి తెలిసే అవకాశం ఉంటుంది. విశేషం ఏమంటే… కేవలం సినిమా తీసి చేతులు దులిపేసుకోకుండా సూర్య… ఏ గిరిజన తెగ కష్టాలనైతే తెర మీదకు తీసుకొచ్చాడో, వారికి సంబంధించిన విద్యా ట్రస్ట్ కు గురువారం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ చేతుల మీదుగా, జస్టిస్ చంద్రు సమక్షంలో కోటి రూపాయల విరాళం ఇచ్చాడు. తాను మాటల మనిషి కాదని, చేతల మనిషినని సూర్య ఈ విధంగా నిరూపించుకున్నాడు.
ప్లస్ పాయింట్స్
కోర్ట్ డ్రామా కావడం
సూర్య పోషించిన పాత్ర
ఇన్వెస్టిగేటివ్ పంథాలో సాగడం
నటీనటుల నటన
మైనెస్ పాయింట్స్
మూవీ రన్ టైమ్
రేటింగ్ : 3 / 5
ట్యాగ్ లైన్: జై సూర్య!