ఆకాశంలో ఉరుములు మెరుపుల శబ్దాలు వినిపించేటప్పుడు భయంతో “అర్జునా…ఫల్గుణా…” అంటూ పిల్లలు కేకలు వేయడం ఇప్పటికీ మన పల్లెల్లో కనిపిస్తూనే ఉంటుంది. అదే తీరున ‘అర్జున…ఫల్గుణ’ సినిమా కూడా ఆరంభమవుతుంది. అయితే ఇందులోని పలు సన్నివేశాలు చూసినప్పుడు ఉరుముల మెరుపులు లేకున్నా ‘బోరు’తో ప్రేక్షకుడు “అర్జునా…ఫల్గుణా…” అంటూ వేడుకోక తప్పదు.
అసలు కథలోకి వస్తే… పచ్చని కోనసీమ ప్రాంతంలోని ఓ పల్లెటూరు. అందులో అర్జున, అతని మిత్రులు తాడోడు, రాంబాబు, ఆస్కార్ ఉంటారు. ఈ నలుగురికి శ్రావణి నేస్తం. అందరూ కలసి చదువుకుంటారు. పెద్దయిన తరువాత కూడా వారి స్నేహం ఎంతో అన్యోన్యంగా కొనసాగుతూ ఉంటుంది. ఆ ఊరిలో ఎక్కువమంది సన్నకారు రైతులే. దాంతో బ్యాంకులో రుణం తీసుకోవడం, అది తీర్చలేని స్థితిలో ఆస్తులు వేలానికి గురికావడం జరుగుతూ ఉంటాయి. అదే తీరున ఓ సారి తాడోడి ఇంటిని బ్యాంక్ సిబ్బంది జప్తు చేస్తారు. ఆ సమయంలో అర్జున వెళ్ళి వారిపై చేయి చేసుకుంటాడు. ఊరి కరణం వచ్చి, గొడవ సద్దుమణిగేలా చేస్తాడు. బ్యాంక్ సిబ్బంది నుండి కొంత గడువు ఇప్పిస్తాడు కరణం. అంతేకాక, ముందుగా యాభై వేలయినా కట్టాల్సిందే అంటే, అదీ కట్టేస్తాడు. అందుకు గాను అర్జున ఎంతో ప్రేమగా చూసుకొనే గోవు ‘సివంగి’ని కరణం తీసుకెళ్తాడు. ఇలాగే ఊళ్ళో తనకు తెలిసిన వారికి ఏమి జరిగినా, అర్జున ముందుకు వెళ్ళి ఏదో ఒక సాయం చేస్తూంటాడు. నలుగురు మిత్రులు కలసి ఓ సోడా కంపెనీ పెట్టాలను కుంటారు. దానికి డబ్బు కావాలి. అలాగే ఊరిలో ఓ రైతు బ్యాంకు రుణం తీర్చలేక పురుగుల మందు తాగి చనిపోతాడు. అది చూసిన తాడోడి తండ్రి తానూ ఓ రోజు అలాగే పోతానేమో అంటాడు. దాంతో అందరూ భయపడి పోతారు.
పరిస్థితులు క్లిష్టం కావడంతో తమతో పాటు చదువుకున్న ఒకడు చెప్పిన గంజాయి సరఫరాకు సరే అంటాడు అర్జున. అతనితో పాటే మిగిలిన నలుగురూ సాగుతారు. నానా తంటాలు పడి, గంజాయి మూట సంపాదిస్తారు. పోలీసులు పట్టుకుంటారు. వారి నుండి తప్పించుకోవడంతో ఛేజ్ మొదలవుతుంది. అర్జున మిత్రుల్లో ఓ భయస్తుడు మత్తులో పోలీస్ జీపులోని సెల్ ఫోన్ పట్టుకొస్తాడు. తమ గంజాయి బ్యాగ్ అనుకొని మరో మూట తీసుకు వస్తారు. దాని నిండా డబ్బు ఉంటుంది. గంజాయి ముఠా ఆ డబ్బు కోసం వీళ్ళను చేజ్ చేస్తారు. ఇలా ఛేజ్ లో పలు మలుపులు తిరిగి, చివరకు ఊరు చేరుకుంటారు. డబ్బును ఓ గడ్డివాములో దాచుతారు. వీరికి గంజాయి డీల్ ఇచ్చిన మిత్రుడు అది చూస్తాడు. డబ్బు కొట్టేసి వాముకు నిప్పంటిస్తాడు. డబ్బు కాలిపోయిందని భావిస్తారు మిత్రులు. అదే సమయంలో ఊరి కరణం కూతురు పెళ్ళి, ఆమెను పెళ్ళాడేవాడు, వీరిని ఛేజ్ చేసిన ఇన్ స్పెక్టర్. అతణ్ని చూశాక భయంతో ఊరు విడిచి వెళ్ళాలనుకుంటారు మిత్రులు. తన గోవు సివంగికి ఓ మాటచెప్పి వస్తానని అర్జున్ వెళ్తాడు. అప్పుడే అక్కడ అతనికి ఓ రహస్యం తెలుస్తుంది. కరణం ఊళ్ళో రైతులకు పూచీపై బ్యాంక్ రుణాలు ఇప్పించడం, జప్తు పేరుతో బ్యాంక్ వారితో దాడి చేయించడం, తరువాత ఆ ఆస్తులు తాను విడిపించుకోవడం, సహకరించిన బ్యాంక్ వారికి అంతో ఇంతో ముట్టచెప్పడం చేస్తూంటాడు. ఆ గొడ్ల పాకలోని ఓ బీరువాలోనే ఈ డాక్యుమెంట్లు పెట్టి ఉంటాడు. వాటిని అర్జున దొంగిలించే కాల్చేస్తాడు. కరణం లబో దిబో మంటాడు. చివరకు అర్జున తన తెలివి తేటలతో కరణం ఏమీ అనకుండా, ఆయన కూతురును కట్టుకోబోయే ఇన్ స్పెక్టర్ ఏమీ చేయకుండా అన్నీ సజావుగా సాగేలా చేస్తాడు. ఎలా చేశాడు అన్నదే క్లయిమాక్స్!
ఛేజింగులతోనే దర్శకుడు తేజ మార్ని సహనాన్ని పరీక్షించారు. ఈ చిత్రానికి తేజనే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఒక్క సీన్ తోనే అసలు విషయాన్ని చెప్పేయగల అంశాలను సైతం చేంతాడంత లాగారు. కొన్నిచోట్ల ఫార్ములా వీడి, సహజత్వం కోసం పాకులాడారు. మరికొన్ని చోట్ల మళ్ళీ ఫార్ములాను గుర్తు చేసుకున్నారు. బహుశా,ఈ మిక్స్ చేయడంలోనే కన్ ఫ్యూజన్ కు గురి అయినట్టు ఉంది. ఈ కంగాళీని చూస్తున్న సమయంలో సాగే కామెడీ మరింత కంగారు పుట్టిస్తుంది. అప్పుడు చూసే ప్రేక్షకుడికి ఇంకా సినిమా ఎంత సేపుందిరా బాబూ…అనే భయం కలుగక మానదు. అప్పుడు తప్పకుండా “అర్జునా…ఫల్గుణా…” అనుకోకుండా ఉండలేడు. కేవలం 129 నిమిషాల పాటు సాగే ఈ సినిమా చాలా పెద్దగా అనిపిస్తుంది. ఓర్పు ఉన్నవారు మాత్రమే ఈ సినిమా చూడడానికి అర్హులు అని చెప్పవచ్చు.
అర్జునగా శ్రీవిష్ణు తన పాత్రను అతిసులువుగా పోషించారు. అతని మిత్రులు కూడా పరవాలేదనిపించారు. సీనియర్ నటులు నరేశ్, శివాజీరాజా తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. పోలీస్ ఇన్ స్పెక్టర్ గా సుబ్బరాజు నటించారు. నాయిక శ్రావణి పాత్రలో అమృతా అయ్యర్ కనిపించారు. నటుడుగా మారిన దర్శకుడు దేవి ప్రసాద్ సెంటిమెంట్ పండించారు.
గీత రచయిత చైతన్య ప్రసాద్ మంచి సాహిత్యమే అందించే ప్రయత్నం చేసినా, అప్పటికే ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే కథనం వల్ల పాటలు జనం మదిని అంతగా దోచుకోలేవు. ఉన్నంతలో “గోదావరి వాళ్ళే సందమామ…” అనే పాట అలరిస్తుంది. ప్రియదర్శన్, బాలసుబ్రమణియన్ సంగీతం కూడా కంగాళీ కథకు ఎస్సెట్ గా నిలవలేకపోయింది. పి.సుధీర్ వర్మ రాసిన సంభాషణల్లో ఒకటి అర ఆకట్టుకుంటాయి.
ఇక చిత్ర నిర్మాతలు నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డిని అభినందించి తీరవలసిందే. ఈ కథను నిర్మించడానికి వారు చేసిన సాహసాన్ని, అందుకు అనువుగా ఖర్చు చేసిన తీరును కూడా మరువరాదు.
ప్లస్ పాయింట్స్:
శ్రీవిష్ణు అభినయం
జగదీశ్ చీకటి సినిమాటోగ్రఫి
మైనస్ పాయింట్స్:
కథలో లోపించిన కొత్తదనం
సాగదీసినట్టుండే సన్నివేశాలు
ఛేజింగ్ లో పలు మలుపులు
రేటింగ్ : 2/5
ట్యాగ్ లైన్: దడ దడ… గడ బిడ…