Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పన్నెండేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగినప్పట్నుంచీ.. ఏపీ రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది. మొదట్లో ఏది రాజధాని అనే ప్రశ్న ఏపీ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేసింది. తర్వాత రాజధాని ఎప్పటికి పూర్తవుతుంది అనే ప్రశ్న.. సమాధానం చెప్పలేని సంక్లిష్టమైనదిగా మిగిలిపోయింది. ఏ కాలంలో అయినా..ఏ విధమైన పాలన ఉన్నా.. రాజధాని అనేది చాలా కీలకం అనే విషయం అందరికీ తెలుసు. ఈ సంగతి మొదట్నుంచీ స్థిర రాజధాని సమస్యను ఎదుర్కుంటున్న ఆంధ్రులకు ఇంకా బాగా తెలుసు. అందుకే వారంతా విభజన జరిగిపోగానే.. త్వరగా రాజధాని కొలిక్కి వస్తుందని ఆశించారు. కానీ ఆశలు అడియాసలు అయి.. కీలకమైన రాజధాని అంశం రాజకీయాలకు వేదికగా మారి.. పుష్కర కాలం కాలయాపన అయింది. ఇంతకూ ఏపీకి రాజధాని శాపం ఎప్పుడు పోతుంది..? కొత్త పంచాయితీలకు ఎప్పటికి తెరపడుతుంది..? ఈ తరం ఏపీ జనం తమ రాజధాని చూడగలరా..? ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు రాజధాని గండం ఉందా ? వాళ్ల జాతకాల్లో రాజధానే లేదా ? గడచిన వందేళ్లుగా ఆంధ్రులు వాళ్ల నాయకుల తప్పిదాల వల్ల ఈరోజుకీ రాజధాని లేని ప్రజలుగానే మిగిలిపోయారు. బహుశా దేశ చరిత్రలోనే కాదు.. ప్రపంచ చరిత్ర లో కూడా రాజధాని లేని ప్రజలు ఆంధ్రప్రదేశ్ వాళ్లేనేమో. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యేవరకూ.. తమిళనాడు రాజధాని మద్రాస్‌ని తమ రాజధానిగా భ్రమిస్తూ బతికేశారు. మద్రాస్ ఆంధ్రుల రాజధాని కాదు.. తమిళుల రాజధాని అని అక్కడి నుంచి ఆంధ్రులను తరిమేశారు. 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కర్నూలు కొన్నాళ్లు ఆంధ్రుల రాజధానిగా ఉంది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డాక హైదరాబాద్ రాజధాని అయ్యింది. 2014లో రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్ తెలంగాణ రాజధాని అయిపోయింది. మళ్లీ ఆంధ్రావాళ్లు రాజధాని లేకుండానే మిగిలిపోయారు. మద్రాస్ కర్నూలు, హైదరాబాద్ ఏవీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాజధానిగా మిగలలేదు. పిల్లి తన పిల్లల్ని తిప్పినట్టు .. ఆంధ్రా వాళ్లు మూడు రాజధానులు తిరిగి ఇప్పుడు నాలుగో రాజధానికోసం వెతుక్కుంటున్నారు.
Also Read
తెలంగాణతో ఆంధ్రా విడిపోయి ఇప్పటికి 12 ఏళ్లు దాటిపోయింది. ఈ రోజుకూ రాజధాని లేకుండా దిక్కూ మొక్కూలేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఏపీ. దీనికి ప్రధాన కారణం ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీలు, ఆ ప్రధాన పార్టీల నాయకులు. ఇప్పుడు కొత్తగా మావిగన్, అమరావతి మధ్య పొలిటికల్ వార్ మరోసారి ఏపీ రాజధానిపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. చంద్రబాబు అమరావతే రాజధాని అని కుండబద్దలు కొడుతున్నారు. పార్లమెంట్లో కూడా అమరావతి రాజధాని అని చట్టం కూడా చేశారని, ఇక ఎవరూ మార్చలేరని తేల్చిచెబుతున్నారు. కానీ జగన్ మాత్రం అమరావతి నిర్మాణం ఏపీకి గుదిబండగా మారుతుందని, మావిగన్ మాత్రమే ప్రాక్టికల్ అని వాదిస్తున్నారు. వైసీపీ నేతలు మరో అడుగు ముందుకేసి.. తాము అధికారంలోకి వస్తే.. మావిగన్ రాజధాని అవుతుందని, ఎట్టి పరిస్థితుల్లో అమరావతిని రాజధానిగా కొనసాగించేది లేదని మొండికేస్తున్నారు. అంతే కాకుండా వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ అజెండాగా జరుగుతాయని జగన్ జోస్యం చెప్పారు. అమరావతి కావాలంటే టీడీపీకి.. మావిగన్ కావాలంటే తమకు ఓటేయాలని మూడేళ్ల ముందే ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదన పెట్టినంత మాత్రాన.. అమరావతి పనులకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. చంద్రబాబుకు ఇంకా సమయం ఉంది కాబట్టి.. అమరావతి పనులు వేగంగా పూర్తిచేయొచ్చు. ఆ పని మానేసి.. ప్రతిపక్షాలపై నెపం నెట్టేయాలని చూడకూడదు. ఎక్కడైనా అధికారంలో ఉన్న పార్టీ ఓ పని అనుకుంటే.. దానిపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. అనుకున్నది అనుకున్నట్టుగా చేసి చూపగలదు. దీనికి రాజధాని పనులు కూడా అతీతం ఏమీ కాదనే సంగతి అందరికీ తెలుసు.
ఇప్పటికే పుష్కర కాలంగా రాజధాని లేక ఏపీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణం కొలిక్కిరావాలని కోరుకుంటున్నారు. రాజధానితో సామాన్యులకు నిమిత్తం లేదనే వాదనలోనూ పసలేదు. ఎందుకంటే ఇప్పటిదాకా ఏ అధికారి ఎక్కడుంటారో తెలియటం లేదు. ఎవర్ని కలవాలంటే ఎక్కడకు వెళ్లాలనే విషయంపై క్లారిటీ లేదు. మిగతా రాష్ట్రాల్లో రాజధానికి వెళ్తే.. అన్ని పనులు పూర్తవుతున్నాయి. కానీ ఏపీలో మాత్రం అలా ఎక్కడికి వెళ్తే అన్ని పనులు జరుగుతాయనేది ఇంకా తేలలేదు. ఎందుకంటే ఇప్పటికీ అన్ని ఆఫీసులూ అమరావతి నుంచి పనిచేయటం లేదు. నిజంగా ఉద్యోగులందరూ తరలివచ్చినా.. అక్కడ సరిపడ సౌకర్యాలు కూడా లేవు. ఇటు ప్రజల అవసరాలు, అటు ఉద్యోగుల సౌకర్యాలు కూడా తీర్చకుండా.. అసలు రాజధాని ఎప్పటికి కొలిక్కి వస్తుందో తేల్చకుండా ఏళ్ల తరబడి ఇలా విషయాన్ని సాగదీయటం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా గతంలో అభివృద్ధి కాముక రాష్ట్రంగా దేశంలో మొదటి నాలుగైదు రాష్ట్రాలతో పోటీపడ్డ ఏపీ.. ఇప్పుడు రాజధానికీ గతి లేని దయనీయ స్థితిలో ఉందనే సూటిపోటి మాటలు ఎంతకాలం భరించాలని ఏపీ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఇక్కడ ఏపీ ప్రజలేమీ తెల్లారేసరికి రాజధాని నిర్మించాలని గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఆ మాటకొస్తే రాష్ట్ర విభజన జరిగిన పన్నెండేళ్లు కావస్తోంది. కానీ ఇంతవరకూ ఏపీ రాజధాని రూపు దిద్దుకోలేదు. మూడు ప్రభుత్వాలు వచ్చినా.. రాజధాని కొలిక్కిరాకపోవడం.. ఏపీకి లోటుగానే ఉంది. దేశంలో పాత రాష్ర్టాలు, కొత్త రాష్ర్టాలనేకం ఉన్నాయి. కొన్నిటికి పాత రాజధానులు కొనసాగుతుండగా, కొన్నిటికి కొత్తవి ఏర్పడ్డాయి. కాని దేశంలో ఏ ఒక్క ప్రాంతానికి రాజధాని ఒక సమస్యగా మారలేదు.1947 నుంచి ఇప్పటి వరకు ఈ సమస్యను ఎదుర్కొంటూ వస్తున్న ఏకైక జాతి ఆంధ్రులు మాత్రమే. ఇది విచిత్రంగా కనిపిస్తుంది. విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఒక సుదీర్ఘమైన చరిత్ర, సంస్కృతులున్నా యి. భూములు, గనులు, ప్రకృతి సంపదలు, సముద్ర తీర రూపంలో యావద్దేశంలోనే పేరుపొందిన సంపన్న ప్రాంతాల్లో అది ఒకటి. ఇటువంటి ఆంధ్ర జాతికి తమదైన రాజధాని ఒకటి స్థిరమైన రూపంలో ఎప్పుడో ఏర్పడి ఉండవలసింది. అది ఈ సరికి ఎంతో అభివృద్ధి చెందవలసింది.
కానీ ఏపీలో రాజధాని పనులు వేగంగా సాగడం లేదనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పైగా రాజధాని నిర్మాణంపై చాలా సందేహాలున్నాయి. ఆ సంశయాలను తొలగించాల్సిన అవసరం ప్రభుత్వాలపైనే ఉంటుందనడంలో సందేహం లేదు. రాజధాని నిర్మాణాన్ని మొదట ప్రణాళికల పేరుతో కొన్నాళ్లు, తర్వాత నిధుల పేరుతో మరికొన్నాళ్లు సాగదీత వ్యవహారం కొనసాగింది. ఎప్పటికప్పుడు రాజధాని పనులు ఊపందుకున్న ఛాయలు కనిపించడం.. అంతలోనే నత్తనడకన నిర్మాణాలు సాగటం.. ఏపీ ప్రజలకు రొటీన్ తంతు అయిపోయింది. అందుకే వారికి అనుమానాలు ఎక్కువౌతున్నాయి. ఇప్పుడు అమరావతే రాజధాని పార్లమెంట్ చట్టాన్ని ఆమోదించిన తర్వాతైనా రాజధాని నిర్మాణం త్వరగా కొలిక్కితీసుకురావాలనే ఆలోచన లేకుండా.. ప్రధాన పార్టీలు ఇంకా కొత్త పంచాయితీలతో కాలయాపన చేస్తుండటాన్ని ఏపీ ప్రజలు భరించలేకపోతున్నారు.
ఎందుకంటే రాజధాని కేవలం ఓ భౌగోళిక నగరం మాత్రమే కాదు.. ఏపీ భవిష్యత్తుకు, ఏపీ ప్రజల రేపటి ఆశలకు, ఆకాంక్షలకు ప్రతిబింబంగా మారాల్సి ఉంది. అంటే వారు జీవితంలో ఎదగటానికి కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్రంలో అయినా రాజధాని పరిసరాల్లో స్థిర నివాసం ఏర్పరుచుకుంటే.. మెరుగైన అవకాశాలు ఉంటాయని, జీవితంలో ఎదగొచ్చని సామాన్యులు అనుకోవడం సహజం. అలా అనుకుంటారు కనుకే ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ కు వలసలు భారీగా పెరిగాయి. ఇప్పుడు కూడా హైదరాబాద్ కు వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా రాజధాని విషయంలో అనవసర పంతాలకు పోకుండా.. ప్రజల కోణంలో ఆలోచిస్తేనే.. రాజధాని పనులు త్వరగా కొలిక్కి వస్తాయి. ఏపీ నేతలు కాస్త పెద్ద మనసు చేసుకుని రాజనీతిజ్ఞతను ప్రదర్శిస్తే.. రాజధాని లేని రాష్ట్రమనే అవమాన భారం ఏపీకి త్వరలో తప్పుతుంది. లేదంటే ఎప్పటికప్పుడు రాజధాని ఏది అంటే దిక్కులు చూడటమే పనిగా పెట్టుకోవాల్సిన అగత్యం ఏర్పడుతుంది.
అసలు దేశంలో స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర్నుంచీ చాలా రాష్ట్రాలు కొత్తగా ఏర్పడ్డాయి. అలాగే విభజన తర్వాత ఏపీ మాదిరిగా రాజధానులు కోల్పోయిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కానీ ఎక్కడా రాజధాని నిర్మాణం ఇంత సుదీర్ఘకాలం జరగలేదు. ప్రతి రాష్ట్రంలోనూ రాజధాని నిర్మాణానికి ప్రాధాన్యత ఇచ్చి.. వీలైనంత త్వరగా దానికి రూపుదిద్దారు. దానికి ఎప్పుడో ఏర్పడ్డ గుజరాత్ నుంచి మొన్నీమధ్యే ఏర్పాటైన ఛత్తీస్ గఢ్ దాకా ఉదాహరణలు చెప్పుకోవచ్చు. మరి ఏపీలో ఎందుకు రాజధాని కొలిక్కిరావడం లేదు..? దానికి నెపం ప్రతిపక్షాలమీద నెట్టేయడం తేలికే. కానీ అధికారంలో ఉన్న పార్టీ ఏం చేస్తోంది..? ప్రపంచంలో ఏ ప్రతిపక్షం కూడా ప్రభుత్వాలు చెప్పిన వాటికి సరే అనదు. వాటి ఆలోచన వాటికి తప్పేంకాదు. కానీ చిత్తశుద్ధి, కార్యదక్షత ఉండాల్సింది అధికార పక్షానికే. అలా ఏదో చేస్తారనే ఆశతోనే చంద్రబాబు జనం ఓటేశారు. ఆ సమర్థతలో కూడా చంద్రబాబు శంకించలేం. మరి రాజధాని విషయం వచ్చేసరికి ఏం జరుగుతోందో తెలియదు. పని మాత్రం ఆశించినంత వేగంగా ముందుకు సాగటం లేదు.
తాజావార్తలు
-
Chairmans Desk : ఏపీ ప్రజల జాతకంలో రాజధాని యోగం లేదా..?
-
Bonalu 2026: గోల్కొండ నుంచి లాల్‌దర్వాజా వరకు.. బోనాల జాతరకు సర్వం సిద్ధం..
-
US: పర్యాటకుడిపై అడవి దున్న దాడి.. 8 అడుగుల ఎత్తుకు ఎగిరిపడిన వృద్ధుడు.. వీడియో వైరల్
-
Shabad Murder Case : చనిపోవడానికి ముందు రాజ్‌కుమార్ సెల్ఫీ వీడియో.. విస్తుపోయే నిజాలు..!
-
Trump: ఇకపై హార్ముజ్‌ను అమెరికానే సంరక్షిస్తుంది.. ట్రంప్ సంచలన ప్రకటన
ట్రెండింగ్
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!