Chairman’s Desk: ఒకప్పుడు కార్తీక మాసమంటే ఏదో పౌర్ణమి రోజు దీపం పెట్టుకోవడం తప్ప.. ఓ సాదాసీదా పండుగలా గడిచిపోయేది. కానీ భక్తి టీవీ కోటి దీపోత్సవం.. దీపోత్సవం అవసరం, దీపారాధన ప్రాధాన్యం.. సాంస్కృతికంగా, శాస్త్రీయంగా.. వీటికున్న ప్రాముఖ్యతను జనంలోకి తీసుకెళ్లింది. కోటి దీపోత్సవం ప్రభావంతోనే ఈరోజు కార్తీక మాసంలో ప్రతి ఆలయంలో దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి ఇంటా కార్తీక మాసంలో దీపం పెట్టడమనేది తప్పనిసరి ఆచారంగా మారింది. నిజానికి ఈ ఆధ్యాత్మిక సాంస్కృతిక ఆచారం ఈరోజు కొత్తగా వచ్చినది కాదు. సనాతనవాదులుగా ప్రచారం చేసుకుంటున్నవారు తెచ్చిన ఆచారమూ కాదు. ఇది యుగయుగాలుగా , తరతరాలుగా జనం ఆచరిస్తున్న సంప్రదాయమే. ఈరోజు మతతత్వ సంస్థలు, నయా సనాతనవాదులు ప్రచారం చేసుకుంటున్నట్టుగా కాదు. కార్తీక మాసంలో ఇంటింటా దీపం పెట్టడమనేది హిందూ సంస్కృతి తొలినాళ్ల నుంచే ఉంది. దీనిని జనానికి గుర్తుచేస్తూ అంతరించిపోతున్న మన సంస్కృతిని పునరుద్ధరింపజేసి.. ఇంటింటా మళ్లీ దీపాలు వెలిగించింది కోటి దీపోత్సవం. ఈ ఏడాది కోటి దీపోత్సవ వేదికపై కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ కోటి దీపోత్సవాన్ని జాతీయ పండుగగా చేస్తామని ప్రకటించడం.. ఆయన ప్రకటన వెలువడిన 24 గంటల్లోనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కోటి దీపోత్సవాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడమే కాకుండా.. జాతీయ పండగ చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున కేంద్రానికి లేఖ రాస్తానని ప్రకటించడం ఆనందదాయకం. తెలుగు రాష్ట్రాల సాంస్కృతిక చరిత్రలో ఈ ఆధ్యాత్మిక ప్రకటన ఓ గొప్ప సందర్భం. ఇది దీపయజ్ఞానికి దక్కిన అపూర్వ విజయం. ప్రతి హిందువు సగర్వంగా తలెత్తుకునే అపురూప ఘట్టం. ఇదే అంశంపై ఇవాల్టి ఛైర్మన్స్ డెస్క్ చూద్దాం.
కోటిదీపోత్సవానికి వస్తే సమస్త క్షేత్రాలకు వెళ్లినట్టే అనే భావన ప్రతి భక్తుడికీ కలిగేలా కార్యక్రమం రూపకల్పన జరిగింది. ప్రతిరోజూ సరిగ్గా సాయంత్రం ఆరుగంటలకు కైలాసానికి వినపడేలా శంఖారావం మిన్నంటుతుంది. ఆ వెంటనే వేదమంత్రాలు ప్రతిధ్వనిస్తాయి. వెనువెంటనే శివయ్యకు స్వాగతం పలుకుతూ ప్రదోషకాల అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత క్రమంగా స్వరార్చనలు, ఆధ్యాత్మికవేత్తల ప్రవచనాలు, విశేష పూజలు, కల్యాణోత్సవాలు, వాహనసేవలు, జగద్గురువుల ఆశీస్సులు, దీపారాధనలు, లింగోద్భవాలు, సప్తహారతులు, మహానీరాజనాలు, సాంస్కృతిక కదంబాలు.. ఇలా ఒకటేమిటి.. కోటిదీపోత్సవంలో ప్రతి ఘట్టమూ మహాద్భుతమే. కోటిదీపాలు వెలిగించడమంటే మాటలు కాదు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని నోళ్లు నొక్కుకున్నవారు కూడా ఉన్నారు. కానీ ముక్కోటి దేవతానుగ్రహం, జగద్గురువుల ఆశీస్సులు, భక్తుల సహకారం కార్యక్రమం ప్రణాళిక, సిబ్బంది అంకితభావం వెరసి ప్రతి ఏటాఅద్భుతరీతిలో కార్యక్రమం కొనసాగుతోంది. 14 ఏళ్ల క్రితం లక్ష దీపార్చనగా మొదలై.. ఆ తర్వాత కోటి దీపోత్సవంగా మారి తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాస శోభనే మార్చేసింది ఈ ఆధ్యాత్మిక సమ్మేళనం.
ఒక దీపమే మరో దీపాన్ని వెలగించగలదు. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే.. ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది. అమావాస్య చీకట్లను పోగొట్టి జగత్తుకు వెలుగులు పంచే దీపావళి పర్వదినం మరుసటి రోజు నుంచి మనకు కార్తీక దీప సంప్రదాయం మొదలవుతుంది. ఇరు సంధ్యలలోనూ మన లోగిళ్లు, ఆలయాలు దీపతోరణాలై వెలిగిపోతుంటాయి. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం. ఆధ్యాత్మికంగా దీపానికి చాలా ప్రాముఖ్యం ఉంది. మన సంస్కృతికి, సంప్రదాయానికి దీపారాధన పట్టుగొమ్మగా నిలిచింది. అటువంటి సంప్రదాయాన్ని ముందుతరాల వారికి సమున్నతంగా పరిచయం చేయడమే లక్ష్యంగా భక్తి టీవీ కోటిదీపోత్సవం జరుగుతోంది. అయోధ్యలో ఒక్కరోజే పాతిక లక్షల దీపాలు వెలిగాయి. కానీ కోటి దీపోత్సవంలో కార్తీక మాసమంతా లక్షల దీపాలు వెలుగుతాయి.
హైందవ సంస్కృతికి పట్టాభిషేకం చేసే ఉద్దేశంతో.. సనాతన సంప్రదాయాల్ని నేటి తరానికి గుర్తుచేసే మహోన్నత ఆశయంలో తొలి దక్షిణ భారత ఆధ్యాత్మిక ఛానల్ గా భక్తి టీవీ ప్రారంభమైంది. భక్తి టీవీ రాకతో తెలుగునాట భక్తి ఉద్యమం వచ్చింది. పూజల దగ్గర్నుంచీ పురాణాల వరకూ హిందూ సంప్రదాయాన్ని సుసంపన్నం చేసే ప్రతి అంశాన్ని భక్తులకు పరిచయం చేస్తూ భక్తి టీవీ ప్రస్థానం సాగింది. ఇక హైందవ సంస్కృతిలో కీలకమైన దీపారాధన ఘట్టానికి పట్టం కడుతూ.. కోటి దీపోత్సవానికి రూపకల్పన చేసింది భక్తి టీవీ. కోటి దీపోత్సవం పేరుతో భక్తి టీవీ.. సరికొత్త అధ్యాయానికి తెరతీసిందనే చెప్పాలి. భక్తి టీవీ కోటి దీపోత్సవం మొదలుపెట్టిన తర్వాత.. తెలుగురాష్ట్రాల్లో ఆధ్యాత్మిక విప్లవం వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మికత వెల్లివెరియడంలో భక్తి టీవీ తన వంతు పాత్ర పోషించింది. భక్తుల్లో ఆధ్యాత్మికత పెంచుతూ.. తాను కూడా పెరిగింది భక్తి టీవీ. ఇప్పుడు భక్తి టీవీ దేశంలోనే నంబర్ వన్ ఆధ్యాత్మిక ఛానెల్.
కోటి దీపోత్సవ ప్రభావంతో తెలుగునాట ప్రతి ఆలయంలో ఈరోజు కార్తీకమాసంలో దీపోత్సవం జరుగుతోంది. స్వచ్ఛంద సంస్థలు, ట్రస్టులు భక్తి టీవీ కోటి దీపోత్సవం ప్రభావంతో.. కార్తీకమాసంలో దీపోత్సవాలు చేస్తున్నాయి. ఇలా దీపారాధన సంస్కృతికి తాను పట్టం కట్టడమే కాకుండా.. అందరిలోనూ ఆ సనాతన స్ఫూర్తిని నింపింది భక్తి టీవీ కోటి దీపోత్సవం. కార్తీకంలో దీపోత్సవాల్లో ఒక్క దీపాన్ని వెలిగించినా చాలు అనంత పుణ్యఫలాలు లభిస్తాయి. స్వయంగా వెలిగించకపోయినా, మరొకరు వెలిగించిన దీపాన్ని కళ్లకద్దుకున్నా, నమస్కరించినా మంచిదేనని పండితులు చెబుతారు. కార్తీకం హరిహరులిద్దరికీ ప్రీతిపాత్రమే అయినా.. శివారాధన ప్రత్యేకంగా చేస్తారు. ఏక బిల్వం శివార్పణం అంటూ కార్తీకంలో ఒక్క మారేడు దళాన్నైనా శివలింగంపై ఉంచితే చాలు. ఓం నమశ్శివాయ అంటూ కాసిన్ని నీళ్లు శివలింగంంపై పోయగలిగితే చాలు. ఒక్క సోమవారం నాడైనా నక్షత్ర దర్శనం వరకు శివారాధనలో గడిపి, భుజింపగలిగితే చాలు. హరోంహర శంకరా అంటూ ఈ నెల రోజుల్లో ఒక్కరోజైనా పుణ్యనదుల్లో మునకవేస్తే చాలు. సమస్త తీర్థాలు, క్షేత్రాలు సేవించిన ఫలం.. సాధుసత్పురుషుల్ని దర్శించిన ఫలం అన్నింటినీ మనకు కార్తీకమే అందిస్తుంది.
కార్తీకమాసంలో సమస్త దేవతలను కోటిదీపోత్సవ వేదికపై దర్శించుకోవచ్చు. వారికి జరిగే కల్యాణోత్సవాలను, విశేషపూజలను వీక్షించవచ్చు. ద్వాదశ జ్యోతిర్లింగాలు, పంచభూతలింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, శ్రీవైష్ణవ దివ్యదేశాలు ఇలా అనేకానేక విశిష్ట ధామాల నుంచి కోటిదీపోత్సవ వేదికపై ఉత్సవమూర్తులు కొలువుదీరతాయి. ఆ ఉత్సవర్లను దర్శించటం సాక్షాత్తు ఆ క్షేత్రాలకు వెళ్లడంతో సమానం. కార్తీకం వచ్చిందంటే కొండల మీద నుంచి దివ్వెలు దిగివస్తాయి. భక్తి టీవీ కోటి దీపోత్సవంలో దైవానికి ప్రతిరూపాలైన దీపశిఖలు నేలపై రెపరెపలాడుతూ కోటి కాంతులు పంచుతాయి. ఓంకారానికి వంతపాడే శంఖారావాలు, ఢమరుక ధ్వనులు, ఘనాపాఠీల వేదపారాయణలు, జగద్గురువుల అనుగ్రహ భాషణలు, పీఠాధిపతుల దివ్య ఆశీర్వచనాలు, మాతృశ్రీల మంగళాశాసనాలు దీపోత్సవ ప్రాంగణానికి ఆధ్యాత్మిక శోభను సంతరిస్తాయి. ప్రదోషవేళ మహాదేవునికి ప్రీతిపాత్రమైన అభిషేకాలు, బ్రహ్మోత్సవంగా వివిధ వాహన సేవలు, వైభవంగా దేవీదేవతల కల్యాణాలు, విశేష పూజలు, విచ్చేసిన భక్తుల మనసులను భక్తి పారవశ్యంలో ముంచెత్తుతాయి. భక్తి టీవీ అందిస్తున్న వార్షిక సంప్రదాయం కోటి దీపోత్సవం.
దీపం అంటే దైవానికి ప్రతిరూపం. దీపం వెలిగితేనే దైవం అవతరిస్తుంది. దీప ప్రకాశమే మనిషికి దైవసాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తుంది. దీపానికి, దైవానికి అభేదాన్ని చూపేందుకు ప్రతిరోజూ దీపారాధన చేయమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపాన్ని వెలిగించడమే అతి పెద్ద పుణ్యకార్యం. అటువంటి పుణ్య ఫలితం ప్రతి ఒక్కరికీ దక్కాలనే సంకల్పంతో మహాదేవుడికి ప్రతి ఏటా భక్తి టీవీ సమర్పిస్తున్న దీప నీరాజనమే కోటి దీపోత్సవం. పన్నెండేళ్ల క్రితం వరకు కార్తీకమాసంలో అనేకానేక క్షేత్రాల్లో దీపోత్సవాలు జరిగేవి. కానీ చరిత్రలో మునుపెన్నడూ చేయని విధంగా భక్తిటీవీ చేపట్టిన విశిష్ట కార్యక్రమం కోటిదీపోత్సవం. 2012లో లక్ష దీపోత్సవంగా ప్రారంభమైన ఈ దీపయజ్ఞం.. 2013లో కోటిదీపోత్సవమై.. పద్నాలుగేళ్లుగా భక్తుల మదిలో అఖండజ్యోతిగా వెలుగొందుతోంది. దీపం అంటే ప్రమిదలో నూనెపోసి.. వత్తివేసి.. అగ్ని వెలిగించటం కాదు. దీపం దైవానికి ప్రతిరూపం. దీపారాధనతో దైవసాన్నిధ్యం కలుగుతుంది. అందుకే దీపానికి, భగవంతునికి అభేదం చూపేందుకు ప్రతిరోజూ దీపం వెలిగించిమన్నారు మన పెద్దలు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపం వెలిగించటానికి మించిన పుణ్యకార్యం మరొకటి లేదు. ఇటువంటి పుణ్యఫలితం ప్రతి ఒక్కరికీ దక్కాలనే సంకల్పానికి ప్రతిరూపమే భక్తి టీవీ కోటిదీపోత్సవం.