Zomato UPI: ప్రముఖ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ డెలివరీ యాప్ జొమాటో ఇకపై యూపీఐతో సేవలను అందించనుంది. ఐసీఐసీఐ బ్యాంకుతో కలిసి ఈ సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జొమాటో ప్రకటించింది. ఇకపై నేరుగా జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు ఇకపై గూగుల్ పే, ఫోన్ పే వంటి థర్డ్ పార్టీ యాప్స్ సపోర్ట్ లేకుండా నేరుగా జొమాటో నుంచే పేమెంట్స్ చేయవచ్చు. ఇందుకోసం యూజర్లు ఐడీ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ ఆర్డర్ చేసే కస్టమర్లు చాలా మంది యూపీఐ వాడుతున్నారని, అందుకే ఐసీఐసీఐ సహకారంతో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు.
Read Also: Monsoon: ఈ సారి సాధారణం కన్నా తక్కువ వర్షపాతమేనా..? రుతుపవనాలపై “ఎల్ నినో” ఎఫెక్ట్
ఇదిలా ఉంటే ఇన్నాళ్లు క్యాష్ ఆన్ డెలివరీ(సీఓడీ) సదుపాయాన్ని కల్పిస్తూ వస్తున్న జొమాటో ఇకపై దాన్ని ఎత్తేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సీఓడీ ఆప్షన్ పెట్టుకున్న సందర్భాల్లో కస్టమర్లు ఫుడ్ ఆర్డర్ ను తిరస్కరిచే అవకాశం ఉన్నందున ఈ విధానాన్ని ఎత్తేయాలని జొమాటో భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే క్యాష్ లెస్ విధానంలో భాగంగా ‘నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’(NPCI) యూపీఐ విధానాన్ని తీసుకువచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో గూగుల్ పే, ఫోన్ పేలదే మెజారిటీ వాటా ఉంది. అందుకే ఏ ఒక్క కంపెనీ కూడా 30 శాతానికి మించి మార్కెట్ వాటా కలిగి ఉండకూడదని ఎన్పీసీఐ నిర్ణయించింది. దీనికోసం 2024 డిసెంబర్ 31ని డెడ్ లైన్ గా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ రెండు యాప్స్ పై అతిగా ఆధారపడటాన్ని తగ్గించేందుకు వేర్వేరు సంస్థలు యూపీఐ సేవలు అందించేందుకు అనుమతి ఇస్తోంది. దీనిలో భాగంగానే జొమాటో యూపీఐ సేవల్ని ప్రారంభించింది. జొమాటో తరహాలోనే ప్లిప్ కార్ట్ కూడా యూపీఐ సేవల్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం.