Monsoon: ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా అంటే జూన్ 4న నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఎల్ నినో ఎఫెక్ట్ ఉంటుందని ఐఎండీ ఇప్పటికే వెల్లడించింది. దీంతో జూన్-సెప్టెంబర్ నైరుతి రుతుపవన కాలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువగా వర్షాలు కురిసే అవకాశం 90 శాతం ఉందని తెలిపింది. గతంలో ఎల్ నీనో ఏర్పడిన పలు సందర్భాల్లో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదు అయింది. కొన్నిసార్లు తీవ్రమైన కరువు ఏర్పడి పంటలు దెబ్బతిన్నాయి.
ఎల్ నినో అంటే ఏమిటి..?:
ఎల్ నినో అనేది మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా ఎక్కువగా పెరిగినప్పుడు ఏర్పడే వాతావరణ దృగ్విషయం. ఈ ఉష్ణోగ్రతల పెరుగుదల వాతావరణ మార్పులకు కారణం అవుతుంది. ఇది భారతదేశ ఉపఖండంలో రుతుపవన వ్యవస్థ బలహీనపడటానికి దారి తీస్తుంది. ఎల్ నినో ఏర్పడిన సమయంలో రుతుపవనాలు బలహీనంగా ఉంటాయి. ఫలితంగా దేశంలో తక్కువగా వర్షాలు నమోదు అవుతాయి.
ఎల్ నినో, రుతుపవనాలకు సంబంధం:
ఎల్ నినో ఏర్పడిన సందర్భాల్లో భారతదేశంలో కొన్నిసార్లు సాధారణం కన్నా అధికంగా వర్షాలు కురిసిన సందర్భాలు ఉన్నాయి. అయినా కూడా ఎల్ నినో, రుతుపవన వ్యవస్థ పరస్పరం సంబంధం కలిగి ఉంది. గత ఏడు దశాబ్ధాల కాలంలో ఎల్ నినో 15 సార్లు సంభవించింది. ఇందులో ఆర సందర్భాల్లో సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం సంభవిస్తే, మిగతా 9 సార్లు సాధారణం కన్నా తక్కువగా వర్షపాతం నమోదు అయింది. గడిచిన నాలుగు ఎల్ నినోలు సందర్భాల్లో వర్షాలు చాలా తక్కువగా కురిశాయి. ఎల్ నినోను ఉష్షోగ్రతలను బట్టి బలహీనమైనదరిగా, మధ్యస్థమైనదిగా, బలమైనదిగా వర్గీకరిస్తారు.
2009లో బలహీనమైన ఎల్ నినో దేశంలో వర్షపాతం గణనీయంగా తగ్గడానికి కారణమైంది. సాధారణం కన్నా 78.2 శాతానికి వర్షపాతం పడిపోయింది. ఇది గత 37 ఏళ్లలో నమోదు అయిన అత్యల్ప వర్షపాతం. దీనికి విరుద్ధంగా 1997లో బలమైన ఎల్ నినో ఏర్పడింది, ఆ సమయంలో భారతదేశంలో సాధారణంతో కన్నా ఎక్కువ అంటే 102 శాతం వర్షపాతం నమోదు అయింది. 2023లో కూడా ఎల్ నినో బలంగా ఉండే అవకాశాలు ఉన్నాయిన వాతావరణ నమూనాలు అంచనా వేస్తున్నాయి.
భారతదేశానికి రుతుపవనాలు ఎంత ముఖ్యం:
భారతదేశానికి, భారత ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగం రుతుపవనాలపై ఆధారపడి ఉందని చెబితే అతి అతిశయోక్తికాదు. ఎందుకంటే దేశంలోని ఎక్కువ వ్యవసాయం రుతుపవన వ్యవస్థపై ఆధారపడే ఉంటుంది. ముఖ్యంగా నైరుతి రుతుపవనాల సమయంలో ఇది మరింత ఎక్కువ. గోధుమ, వరి, చెరకు, సోయాబీన్స్ పంటలకు రుతుపవనాలే ఆధారం. దేశ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థకు 19 శాతాన్ని వ్యవసాయ రంగం అందిస్తోంది. 1.4 బిలియన్ల జనాభాలో సగాని కన్నా ఎక్కువ మంది ఈ రంగంపైనే ఆధారపడి ఉన్నారు.