ట్విట్టర్ సోషల్ మీడియా వాడేవారికి పరిచయం అక్కర్లేని పేరు. వ్యక్తులు, సంస్థలు, రాజకీయపార్టీలు తమ ప్రచారం కోసం ట్విట్టర్ ను విరివిగా వాడతారు. సెలబ్రిటీలయితే లక్షలాదిమంది అభిమానులకు ట్విట్టర్ ద్వారా చేరువ అవుతారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ట్విట్టర్ తాజాగా గుడ్ న్యూస్ అందించింది. త్వరలో తీసుకురాబోయే ఫీచర్ ద్వారా అక్షరాల పరిమితి వుండబోదు. ఈ ఫీచర్ సాయంతో ఎంత పెద్ద వ్యాసాన్నయినా ట్విట్టర్ లో పోస్టు చేసే అవకాశం కలుగుతుంది.
మొదట్లో ట్విట్టర్ లో ఒక పోస్టుకు 140 అక్షరాల లిమిట్ ఉండేది. 140 అక్షరాలు దాటితే ట్విట్టర్ లో పోస్టు చేయడం కుదరదు. ఆ తర్వాత కాలంలో ఆ పరిమితిని 280 అక్షరాలకు పెంచారు. అయినప్పటికీ ఏదైనా భారీ సమాచారం పోస్టు చేయాలంటే వరుసగా ట్వీట్లు చేయాలి. ఇప్పుడీ సమస్యకు ఫుల్ స్టాప్ పడనుంది. దీనికి ట్విట్టర్ కొత్త పేరు కూడా పెట్టింది. ‘ఆర్టికల్స్’ పేరుతో ట్విట్టర్ త్వరలోనే కొత్త ఫీచర్ ను ప్రవేశపెడుతోంది.
మెనూలో దీనికి సంబంధించిన ఆప్షన్ కనిపిస్తుంది. అక్షరాల పరిమితికి సంబంధించి ట్విట్టర్ పై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ‘ఆర్టికల్స్’ ఫీచర్ తో ట్విట్టర్ ఆ విమర్శలు తొలగిపోతాయని భావిస్తున్నారు. ఎన్ని అక్షరాలున్నా హ్యాపీగా ట్వీట్ చేయవచ్చు. ఈ ఫీచర్ కోసం నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.