Tesla: భారతదేశం ఆటోమొబైల్స్ మార్కెట్ రోజురోజుకు విస్తరిస్తోంది. దీంతో పాటు ఈవీ వాహనరంగం కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ప్రఖ్యాత ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ, ఎలాన్ మస్క్ కి చెందిన టెస్లా భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఇండియాలో టెస్లా కార్ల ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతోంది. ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతోంది. 24,000 డాలర్ల ఖరీదు కలిగిన కార్లను భారత్ లో నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తోంది. టెస్లా ఫ్యాక్టరీకి సంబంధించిన చర్చలనే నేరుగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పర్యవేక్షిస్తున్నారు.
Read Also: Padma Hilsa: దుర్గా నవరాత్రి ఉత్సవాలకు బంగ్లాదేశ్ గిఫ్ట్.. “పద్మా పులస” చేపల ఎగుమతికి ఓకే..
ఇదిలా ఉంటే టెస్లా దేశంలో బ్యాటరీ స్టోరేజ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు, వాటిని తయారు చేసేందుకు, విక్రయించడానికి ప్రణాళికలను రూపొందించి, ఫ్యాక్టరీని నిర్మించేందుకు ప్రభుత్వం నుంచి ప్రోత్సకాలను కోరుతూ అధికారులకు ప్రతిపాదనల్ని సమర్పించినట్లు తెలుస్తోంది. టెస్లా తన ‘పవర్ వాల్’తో దేశంలో బ్యాటరీ నిల్వ సామర్థ్యానికి మద్దతు ఇవ్వాలని ప్రతిపాదించింది. ఇది సోలార్ ప్యానెళ్లు, గ్రిడ్ నుంచి పవర్ ని స్టోర్ చేసుకుని రాత్రి వేళల్లో, కరెంట్ అంతరాయాల్లో ఉపయోగించడానికి నిల్వ చేయబడుతుంది.
ఈ ప్రతిపాదనపై ఇటు ప్రభుత్వం, అటు టెస్లా రెండూ కూడా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత్ లో విస్తరించడానికి టెస్లా చాలా ప్రయత్నిస్తోంది. అయితే దీనిపై ఇప్పటి వరకు టెస్లా ప్రతినిధులు కానీ, వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పందించలేదు. భారత్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. దేశంలో గ్రామాలకు, పట్టణాలకు విద్యుత్ సరఫరా పెరిగింది. అయితే డిమాండ్ వల్ల పీక్ టైమ్ లో షార్టేజ్ ఏర్పడుతుంది. ఇప్పటికీ దేశంలో మెజారిటీ పవర్ జనరేషన్ బొగ్గుపై ఆధారపడి ఉంది. ఇండియాలో పవర్ జనరేషన్ స్టోరీజీ అందుకు అవసరమైన టెక్నాలజీ పెద్దగా విస్తరించలేదు. ఈ అవకాశాలను టెస్లా అందిపుచ్చుకోవాలని అనుకుంటోంది.