Adani-Hindenburg Case: హిండెన్ బర్గ్ కేసులో అదానీ గ్రూపుకు భారీ విజయం దక్కింది. అదానీ-హిండెన్ బర్గ్ కేసులో సెబీ క్లీన్‌చిట్ ఇచ్చింది. సెబీ దర్యాప్తును సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. అదానీ వ్యవహారంపై విచారణ జరపాలని దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను ప్రత్యేక దర్యాప్తు బృందాని(సిట్)కి బదిలీ చేయడానికి ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొంది. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఆరోపణలపై సెబీ విచారణలో ఎలాంటి లోపం లేదని సుప్రీంకోర్టు చెప్పింది.
Read Also: Ajit Agarkar: బీసీసీఐ కీలక నిర్ణయం.. తేలిపోనున్న కోహ్లీ, రోహిత్ టీ20 భవితవ్యం..!
సెబీ దర్యాప్తును అనుమానించడానికి జార్జ్ సోరోస్ నేతృత్వంలోని ఓసీసీఆర్పీ నివేదిక ఆధారం కాదని చెప్పింది. సుప్రీంతీర్పు అదానీ గ్రూపుకి భారీ విజయంగా చెబుతున్నారు. అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ గతేడాది అదానీ గ్రూపుపై భారీ ఆరోపణలు చేసింది. ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్లు ఓ నివేదికను తీసుకువచ్చింది. ఈ ఆరోపణలతో ముడిపడి ఉన్న 24 కేసుల్లో 22 కేసుల్ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) విచారించింది. మిగిలిన రెండు కేసుల్లో విచారణ పూర్తి చేసేందుకు సెబీకి సుప్రీంకోర్టు మూడు నెలల గడువు ఇచ్చింది. అయితే షార్ట్ సెల్లింగ్‌కి సంబంధించి ఏదైనా చట్ట ఉల్లంఘన జరిగిందా..? లేదా..? అనే విషయాలను పరిశీలించాలని సుప్రీంకోర్టు సెబీని, కేంద్రాన్ని ఆదేశించింది. చట్టానికి అనుగుణంగా చర్య తీసుకోవాలని వ్యాఖ్యానించింది.