చదువు పూర్తయ్యాక చాలా మంది వ్యాపారం కోసం లేదా ఉద్యోగం కోసం ఇళ్ల నుంచి వెళ్లిపోతుంటారు. ఇంట్లో ఉంటూనే కెరీర్‌లో రాణించేవారు కొందరు మాత్రమే ఉంటారు. అరుణ్ శర్మ కూడా అలాంటి వాడే. కాశ్మీర్ నివాసి అయిన అరుణ్ ఎంబీఏ పాసౌట్. ఇతర ప్రాంతాలకు వెల్లడం ఇష్టం లేక.. తన స్వగ్రామంలో పుట్టగొడుగులను సాగు చేస్తున్నాడు. పుట్టగొడుగుల పెంపకం ద్వారా ఏటా రూ.90 లక్షల ఆదాయం పొందుతున్నాడు.
పుట్టగొడుగుల పెంపకం ఆలోచన…
అరుణ్ జమ్మూ కాశ్మీర్‌లోని కథువా నివాసి. ఎంబీఏ పూర్తయ్యాక ఇంటి నుంచి వెళ్లడానికి ఇష్టపడలేదు. అతను తన కుటుంబంతో ఉండి ఒక ఎన్‌జీవోలో చేరాడు. ఈ ఎన్‌జీవో మహిళల కోసం పని చేసింది. అదే సమయంలో, మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటానికి ప్రభుత్వం కతువాలో బటన్ మష్రూమ్ పెంపకంపై శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇక్కడి నుంచే పుట్టగొడుగుల పెంపకం ఆలోచన అతని మదిలో మెదిలింది.
ఒక గదితో ప్రారంభం..
అరుణ్ తన ఇంట్లోని చిన్న గది నుంచి పుట్టగొడుగుల పెంపకం ప్రారంభించాడు. ప్రస్తుతం అతను ఏటా 35 టన్నుల పుట్టగొడుగులను ఉత్పత్తి చేస్తున్నాడు. రూ.45 లక్షల విలువైన పుట్టగొడుగుల ఎరువులను కూడా రైతులకు విక్రయిస్తున్నాడు. ఈ రెండింటి నుంచి ఏడాదికి రూ.90 లక్షల మొత్తం వ్యాపారం జరుగుతుంది.
మొదటి సంపాదన రూ.16 వేలు..
పుట్టగొడుగుల విత్తనాలు (స్పాన్) కొనడం, చీకటి గదుల్లో వాటి పెంపకం, అనంతరం దాని విక్రయం గురించి నేర్చుకున్నానని అరుణ్ వివరించాడు. అతను స్థానిక సరఫరాదారు నుంచి 100 రెడీమేడ్ మష్రూమ్ బ్యాగ్‌లను కొనుగోలు చేశాడు. ఒక్కో బస్తా రూ.90. సుమారు రెండు నెలల తర్వాత పుట్టగొడుగుల మంచి దిగుబడి వచ్చింది. ఈ పుట్టగొడుగులను అమ్మడం ద్వారా రూ.1600 సంపాదించాడు. ఇదే తన మొదటి సంపాదన.
వ్యాపారం పెద్దదైంది..
ఈ విజయంతో అరుణ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఆ తర్వాత గదిలో పుట్టగొడుగుల సంచుల సంఖ్యను పెంచాడు. ఎన్జీవోలో కూడా పని కొనసాగించాడు. 2014లో పుట్టగొడుగులకు మార్కెట్‌లో డిమాండ్ పెరిగిందని గ్రహించాడు. సాగును విస్తరిస్తే.. లాభదాయకంగా ఉంటుందని అరుణ్ అనుకున్నాడు. తన ఇంటి సమీపంలోని పాత భవనాన్ని వాడుకుని సాగు విస్తీర్ణం పెంచాడు. ఇదిలా ఉండగా.. 2015లో అరుణ్ బ్యాంకులో రూ.7 లక్షలు అప్పు తీసుకున్నాడు. అలాగే తన పొదుపు ద్వారా రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టి పుట్టగొడుగుల పెంపకానికి సిద్ధం చేసుకున్నాడు. ఇది ఏ సీజన్‌లోనైనా పుట్టగొడుగుల పెంపకం చేసే యూనిట్. అతను తన ఇంటిలోని 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో యూనిట్‌ను అమర్చాడు. ఒక్కొక్కటి 1.5 టన్నుల రెండు ఏసీలను అమర్చాడు. అమ్మకాలు పెరగడంతో.. అతను 2017లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాడు.
అలాగే పుట్టగొడుగుల ఎరువులు అమ్మకం..
2019 నాటికి.. పుట్టగొడుగుల కంపోస్ట్‌ను పెద్ద ఎత్తున తయారు చేయడం లాభదాయకమైన ఒప్పందం అని అరుణ్ గ్రహించాడు. 5,000 చదరపు అడుగులకు పైగా స్థలాన్ని సిద్ధం చేసినట్లు తెలిపాడు. ఇక్కడి నుంచి ఏడాదికి 50 వేల బస్తాల ఎరువులు ఉత్పత్తి అవుతాయి. కిలో రూ.90 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఏడాదికి రూ.45 లక్షల ఆదాయం సమకూరుతోంది.