గత వారం రోజులుగా భారతీయ స్టాక్ మార్కెట్లు వరసగా నష్టాలను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తదితర అంశాల కారణంగా దేశంలోని స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. గత ఏడు రోజులుగా వస్తున్న నష్టాలకు ఎట్టకేలకు చెక్ పడింది. ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి. ఈరోజు ఉదయం నుంచి సూచీలు లాభాలవైపు కదిలాయి. 1329 పాయింట్ల లాభంతో 55,858 వద్ద సెన్సెక్స్ ముగియగా, నిఫ్టీ 410 పాయింట్ల లాభంతో 16,658 పాయింట్ల వద్ద ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అమెరికా ఫెడ్ రేట్ల పై తీసుకున్న నిర్ణయం వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్న తరుణంలో మార్కెట్ లాభాల బాట పట్టింది.
Read: Live: పేర్నినాని ప్రెస్ మీట్
రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కారణంగా చమురు ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. రష్యా నుంచి యూరప్‌కు చమురు ఎగుమతి అవుతుంది. ఈ ఎగుమతులను రష్యా నిలిపివేయవచ్చనే వార్తలు వస్తున్నాయి. దీంతో ఇరాన్ పై విధించిన ఆంక్షలను సడలించి, అక్కడి నుంచి యూరప్ దేశాలకు చమురును ఎగుమతి చేసేలా చూసేందుకు అమెరికా చర్యలు తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇది మార్కెట్ లకు ఊతం ఇచ్చిందిని చెప్పాలి. రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించినా, స్విఫ్ట్ నుంచి రష్యాను పక్కకు తప్పించకపోవడం కూడా మార్కెట్లు పుంజుకోవడానికి కారణమని చెప్పాలి.