BSBD Account Benefits: జీరో బ్యాలెన్స్ ఖాతాలు ఉన్నవారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది. జీరో బ్యాలెన్స్ ఉన్న కస్టమర్లకు అనేక ఉచిత సేవలను అందించాలని తాజాగా ఆర్‌బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులను ఆదేశించింది. బేసిక్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతాలకు అందుబాటులో ఉన్న ఉచిత సేవల పరిధిని విస్తరించాలని RBI నిర్ణయించింది. ఈ నిర్ణయం ముఖ్యంగా విద్యార్థులు, పేదలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జీరో ఖాతా డిపాజిట్లను తాత్కాలిక ఏర్పాటుగా పరిగణించ వద్దని BSBD కోసం ఖాతాదారుడి దరఖాస్తును ఏడు రోజుల్లోపు ప్రాసెస్ చేయాలని RBI బ్యాంకులను కోరింది. ఈ నియమాలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి వస్తాయని తెలిపింది.
READ ALSO: Yashasvi Jaiswal: వన్డేల్లో తొలి సెంచరీతో చెలరేగి.. శతకాల ఖాతా ఓపెన్ చేసిన జైస్వాల్
కొత్త నిబంధనల ప్రకారం జీరో-బ్యాలెన్స్ ఖాతాలు అన్నీ కూడా BSBD ఖాతాలు నగదు డిపాజిట్లు, ఆన్‌లైన్ ఉపసంహరణలు లేదా చెక్ చెల్లింపులను అందిస్తాయి. ఇంకా నెలవారీ డిపాజిట్ల సంఖ్యపై ఎటువంటి పరిమితులు ఉండవు. జీరో-బ్యాలెన్స్ ఖాతాలను తెరిచే వారికి ఎటువంటి బ్యాంకింగ్ సవాళ్లు రాకుండా ఇవి సహకరిస్తాయి. ఇప్పుడు వినియోగదారులకు వార్షిక రుసుము లేకుండా ATM లేదా ATM-కమ్-డెబిట్ కార్డు కూడా లభిస్తుందని RBI పేర్కొంది. వారికి సంవత్సరానికి కనీసం 25 పేజీలతో కూడిన చెక్‌బుక్, ఉచిత ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, ఉచిత పాస్‌బుక్ లేదా నెలవారీ స్టేట్‌మెంట్ కూడా లభిస్తాయని వెల్లడించింది. ఇంకా నెలకు నాలుగు సార్లు వరకు ఉపసంహరణలు ఉచితంగా ఉంటాయని, కార్డ్ స్వైప్ (PoS), NEFT, RTGS, UPI, IMPS వంటి డిజిటల్ చెల్లింపులు విడిగా అందుబాటులో ఉంటాయని తెలిపింది.
కస్టమర్ల ఆదాయం, ప్రొఫైల్ ఆధారంగా BSBD ఖాతాలను తెరవడానికి కొన్ని షరతులు జోడించాలని బ్యాంకులు సూచించాయి. కానీ RBI ఈ ప్రతిపాదనను అంగీకరించడానికి నిరాకరించింది. ఈ ఖాతాలు అందరి కోసం రూపొందించినవని, వీలైనంత ఎక్కువ మందిని బ్యాంకింగ్‌కు అనుసంధానించడానికి ఇవి దోహదపడతాయని RBI స్పష్టం చేసింది. అందుకని, BSBD ఖాతాదారులపై బ్యాంకులు ఏ విధంగానూ వివక్ష చూపలేవని స్పష్టం చేసింది. ఈ కస్టమర్లకు ఇప్పుడు ఇతర ఖాతాదారుల మాదిరిగానే ప్రయోజనాలు అందించనున్నారు. ఇదే సమయంలో BSBD ఖాతాలలో KYC, మైనర్ ఖాతాలకు సంబంధించిన మునుపటి నియమాలు అమలులో ఉంటాయని వెల్లడించింది.
READ ALSO: IndiGo Crisis: ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు.. ?