IndiGo Crisis: ఇండిగో దేశీయ విమానాల రద్దు, ఆలస్యం ఐదవ రోజైన శనివారం కూడా కొనసాగింది. దీంతో వేలాది మంది ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగింది. ఇదే సమయంలో శనివారం ఉదయం నుంచి విమానాశ్రయాలలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే శుక్రవారం ఎయిర్‌లైన్ అసౌకర్యానికి క్షమాపణలు చెప్పింది. రద్దు చేసిన అన్ని విమానాలకు డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ కూడా ఇచ్చింది. ఇండిగో సంక్షోభానికి అసలు బాధ్యులు ఎవరు, అసలు ఏంటి దీని కథ అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Notices To IndiGo: ఇండిగోకు నోటీసులు ఇచ్చిన విమానయాన శాఖ..
తాజగా కెప్టెన్ సావియో ఫెర్నాండెజ్ మాట్లాడుతూ.. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంక్షోభం వెనుక గల కారణాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లు తెలిపారు. ఈ సంక్షోభానికి పైలట్లు కారణమా? లేదా డీజీసీఏ కొత్త ఎఫ్‌డీటీఎల్ మార్గదర్శకాలే కారణమా? డీజీసీఏ ఇప్పటికే ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు కొత్త నిబంధనల గురించి తెలియజేసి ఉంటే, ఇంత పెద్ద సమస్య ఎలా తలెత్తింది? అనేదానిపై ప్రస్తుతం దృష్టిసారించినట్లు తెలిపారు. కెప్టెన్ సావియో ఫెర్నాండెజ్ బోయింగ్ 777 తో సహా అన్ని రకాల విమానాలను నడిపారు. ఆయన ప్రస్తుతం పైలట్‌గా పనిచేస్తున్నారు. ఆయన వయస్సు 52 ఏళ్లు. ఇంకా ఆయనకు 13 సంవత్సరాల సర్వీసు మిగిలి ఉంది. ఆయన 25 ఏళ్లుగా విమానాలను నడుపుతున్నారు.
ఇండిగో సంక్షోభానికి కారణం ఇదే..
ఇండిగో చాలా పెద్ద విమానయాన సంస్థ అని కెప్టెన్ సావియో ఫెర్నాండెజ్ వివరించారు. ఇది మార్కెట్ వాటాలో 63 శాతం కలిగి ఉందని వెల్లడించారు. ఇండిగో ఈ రంగంలో 20 ఏళ్లుగా పనిచేస్తోందని తెలిపారు. సుమారుగా 5 వేల మంది పైలట్లు 20 ఏళ్లుగా ఇండిగోను నడుపుతున్నారు, కాబట్టి వారు ఇండిగో పేరును ఎందుకు చెడగొట్టాలని కోరుకుంటారు? అని అన్నారు. గతంలో 2 వేల కంటే ఎక్కువ విమానాల సకాలంలో పనితీరు 95 శాతం ఉందని, ప్రస్తుత పరిస్థితిలో 1,000 విమానాలు ఎగురుతున్న క్రమంలో OTP 10 శాతం ఎలా అయింది? ఇది కనీసం 50 శాతం ఉండాలని ఆయన అన్నారు. వాస్తవానికి ఈ సంక్షోభ సమయంలో ఇదే అతిపెద్ద ప్రశ్నగా ఆయన అభివర్ణించారు.
ఇందులో DGCA తప్పు లేదని ఆయన అన్నారు. DGCA తన సొంత నియమాలను రూపొందించింది, అలాగే వాటిని ఎనిమిది నెలల క్రితం ప్రకటించింది. అనుమతి ఇచ్చే ముందు, విమానాలకు పైలట్లు ఉన్నారా అని DGCA అడుగుతుంది. అవును అని వచ్చిన తర్వాత మాత్రమే, శీతాకాలంలో 1,000 అదనపు విమానాలను ఆమోదించింది. అయితే ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తింది? అనేది ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న అని ఆయన అన్నారు. మరోవైపు DGCA నిబంధనల ప్రకారం విమానం కనీస టర్నరౌండ్ సమయం ఎంత ఉండాలని పైలట్ అసోసియేషన్‌ను అడిగినప్పుడు, వారు 40 నిమిషాలు ఉండాలని చెప్పినట్లు వెల్లడించారు. ఇండిగోలో 5,400 మంది పైలట్లు, 10 వేల మంది క్యాబిన్ సిబ్బంది ఉన్నారని పేర్కొన్నారు. DGCA నిబంధనల ప్రకారం ఇండిగో అన్ని ప్రమాణాలకు అనుగుణంగా పని చేస్తుందని తెలిపారు. ఇండిగో సంక్షోభానికి ఓటీపీకి సంబంధం ఉన్నట్లు ఆయన అభిప్రాయపడ్డారు.
READ ALSO: Hardik Pandya: ఏఎంబీ మాల్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్ సందడి..