చాన్నాళ్లుగా అందరూ ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) ఐపీవో మే 4 నుంచే ప్రారంభం కానుంది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా ఎల్‌ఐసీ ప్రవేశించనుంది. ఈ మేరకు ఎల్‌ఐసీ ఒక్కో ఈక్విటీ షేర్‌ను కేంద్ర ప్రభుత్వం రూ.902 నుంచి 949గా నిర్ణయించింది. అయితే పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ ఐపీవోలోని ప్రతి షేరుపై రూ.60 తగ్గింపును కల్పించనున్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. రిటైల్‌తో పాటు ఇతర పార్టిసిపెంట్ల కోసం మే 4 నుంచి మే 9 వరకు ఎల్‌ఐసీ ఐపీవో అందుబాటులో ఉండనుంది. ఐపీవోలో పాలసీ హోల్డర్స్ కోటా ఉండటం ఇదే మొదటిసారి. దీంతో ఈ ఐపీవో ద్వారా చాలా మందికి పెట్టుబడి పెట్టే అవకాశం వచ్చింది.
ఉద్యోగుల కోసం సుమారు 15.81 లక్షల షేర్లను ఎల్‌ఐసీ అందుబాటులో ఉంచనుంది. అటు పాలసీదారుల కోసం ఎల్‌ఐసీ సంస్థ దాదాపు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్ చేసింది. ఎల్‌ఐసీ ఐపీవోలోని ఒక్కో లాట్‌లో 15 షేర్లు ఉండనున్నాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కనీసం ఒక లాట్ నుంచి 14 లాట్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో లాట్ కొనుగోలు చేసేందుకు రూ.14,235 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే పాలసీదారులు ఐపీవో కోసం గరిష్టంగా రూ.2 లక్షల వరకు బిడ్ వేయవచ్చు. ఐపీవోలో షేర్ కొనాలని భావించే పాలసీదారులు 2022 ఫిబ్రవరి 28 నాటికి తమ బీమా పాలసీకి పాన్‌కార్డును లింక్ చేసి ఉండాలి. ఎల్ఐసీ ఐపీవో ద్వారా సుమారు రూ.21వేల కోట్లను సమీకరించాలని కేంద్రప్రభుత్వం భావిస్తోంది.