ఒక్క సిలిండర్‌తో అష్టకష్టాలు పడుతున్న ఇండేన్ గ్యాస్ వినియోగదారులకు శుభవార్త. ఒక్క గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్న కస్టమర్ల కోసం ప్రత్యేకంగా తత్కాల్ సేవ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ఇండేన్ గ్యాస్ సంస్థ ప్రకటించింది. ఇందులో భాగంగా గ్యాస్ బుక్ చేసుకున్న రెండు గంటల్లోనే వినియోగదారులు సిలిండర్ పొందవచ్చని కంపెనీ జనరల్ మేనేజర్ వి.వెట్రీ సెల్వకుమార్ వెల్లడించారు. అయితే తత్కాల్ సేవ సౌకర్యం వినియోగించుకున్న కస్టమర్లు అదనంగా రూ.25 చెల్లించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.
Read Also: రిపబ్లిక్ డే స్పెషల్ సేల్.. 80 శాతం వరకు డిస్కౌంట్లు
ఫోన్, ఇండేన్ ఆయిల్‌వన్ యాప్, ఇండియన్ ఆయిల్ వెబ్‌సైట్ ద్వారా తమ వినియోగదారులు తత్కాల్ సేవలను వినియోగించుకోవచ్చని ఇండేన్ గ్యాస్ కంపెనీ జనరల్ మేనేజర్ సూచించారు. హైదరాబాద్‌లో మొత్తం 62 ఇండేన్ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉన్నట్టు ఆయన వివరించారు. మరోవైపు ఇటీవల ఇండేన్ గ్యాస్ సంస్థ కాంపోజిట్ సిలిండర్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. తక్కువ ధరకే ఈ సిలిండర్‌ను ఇండేన్ సంస్థ అందిస్తోంది. అయితే ఇది సాధారణ సిలిండర్ కాదు… మాములు సిలిండర్ కంటే కొంచెం తక్కువ బరువు కలిగి ఉంటుంది. దీనిపై ప్లాస్టిక్ తొడుగు ఉండటంతో మిగిలిన సిలిండర్ల తరహాలో తుప్పు పట్టే అవకాశం ఉండదు. ఈ కాంపోజిట్ సిలిండర్ కోసం కేవలం రూ.633.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ సిలిండర్‌లో 10 కిలోల గ్యాస్ ఉంటుంది.