Credit Card Mistakes: ఒకప్పుడు ధనవంతుల దగ్గర మాత్రమే క్రెడిట్ కార్డు ఉండేది. కానీ, ప్రస్తుతం వీటిని బ్యాంకులు విరివిగా జారీ చేస్తుండడంతో చాలా మంది దగ్గర ఈ క్రెడిట్ కార్డ్ ఉంది. అయితే, క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారిలో చాలా మందికి సరైన అవగాహన లేకపోవడంతో తప్పులు చేస్తున్నారు. క్రమశిక్షణతో వినియోగించని వారు అప్పుల ఊబిలో ఇరుక్కుపోతున్నారు. కాబట్టి వార్షిక రుసుం, వడ్డీ, క్రెడిట్ లిమిట్, బిల్లింగ్ సైకిల్, గ్రేస్ పీరియడ్ లాంటి వాటి గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి.. అప్పుడే క్రెడిట్ కార్డు వాడకంలో సమస్యలు రావు.
వార్షిక వడ్డీ రేటు
క్రెడిట్ కార్డు బిల్లును డ్యూ డేట్‌కి ముందుగా పూర్తిగా లేదంటే కొంచమైనా చెల్లించకపోతే, మిగిలిన మొత్తంపై పడే వార్షిక వడ్డీ రేటును ఏపీఆర్ అని పిలుస్తారు. ఇందులో సాధారణ వడ్డీతో పాటు ప్రాసెసింగ్ ఫీజు, ఇతర ఛార్జీలు కూడా ఉండనున్నాయి. సాధారణంగా ఈ రేటు 36 శాతం నుంచి 42 శాతం మధ్య ఉంటుంది. కొనుగోళ్లు, క్యాష్ అడ్వాన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, పెనాల్టీలు లాంటి వాటికి వేర్వేరు ఏపీఆర్‌లు ఉండే అవకాశం ఉంది.
Read Also: World Cup 2026 Schedule: ప్రపంచకప్ షెడ్యూల్ వచ్చేసింది.. వేర్వేరు గ్రూప్‌ల్లో భారత్, పాకిస్థాన్!
వార్షిక రుసుం..
క్రెడిట్ కార్డు వినియోగించినందుకు గానూ ప్రతి సంవత్సరం వసూలు చేసే మొత్తాన్ని వార్షిక రుసుం అని పిలుస్తారు. కొన్ని కార్డులకు ఈ రుసుం ఉండదు. మరి కొన్నింటికీ ఒక నిర్దిష్ట మొత్తం ఖర్చు చేస్తే ఈ ఫీజును మాఫీ చేసేస్తాయి.
క్రెడిట్ లిమిట్
క్రెడిట్ కార్డ్‌పై తీసుకునే గరిష్ఠ మొత్తమే క్రెడిట్ లిమిట్ అంటారు. మీ ఆదాయం, క్రెడిట్ స్కోర్ ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు.
Read Also: Shai Hope: చరిత్ర సృష్టించిన షాయ్ హోప్.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇదే తొలిసారి!
మినీమం అకౌంట్ డ్యూ..
ఆలస్యంగా చెల్లింపు ఛార్జీలను నివారించడానికి క్రెడిట్ కార్డ్ బిల్లులో తప్పనిసరిగా కనీస మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇది మొత్తం బకాయిలో ఒక భాగం మాత్రమే అని చెప్పాలి.. సాధారణంగా ఈ మొత్తం బ్యాలెన్స్‌లో 5 శాతం మాత్రమే ఉండనుంది. ఇక, మిగిలిన బకాయిని.. తర్వాత బిల్లుకు జమ చేయనున్నారు. దానిపై వడ్డీ కూడా వేస్తారు.
బిల్లింగ్ సైకిల్
మీ క్రెడిట్ కార్డ్ బిల్లు జనరేట్ అయ్యే సమయాన్ని బిల్లింగ్ సైకిల్‌గా చెబుతారు. సాధారణంగా ఈ కాల వ్యవధి 28 నుంచి 31 రోజులు ఉంటది. క్రెడిట్ కార్డ్ జారీ చేసే కంపెనీ ప్రతి బిల్లింగ్ సైకిల్ ముగింపులో ఒక స్టేట్‌మెంట్‌ను తయారు చేస్తుంది. మీ అన్ని కొనుగోళ్లు, మొత్తం బకాయి, కనీస బకాయి, ఓల్డ్ బకాయి, క్యారీ ఫార్వర్డ్ చేసిన బ్యాలెన్స్ లాంటివన్నీ అందులో రికార్డు అవుతాయి.
గ్రేస్ పీరియడ్
బిల్లింగ్ డేట్ కి, చెల్లింపు గడువు తేదీకి మధ్య ఉన్న సమయాన్ని క్రెడిట్ కార్డ్ గ్రేస్ పీరియడ్ అని పిలుస్తారు. ఈ టైంలో బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లిస్తే, కొనుగోళ్లపై ఎలాంటి వడ్డీ ఉండదు. కానీ, పూర్తి బాకీ చెల్లించకపోతే కొనుగోలు చేసిన రోజు నుంచే వడ్డీ పడుతుంది.
ఆలస్య చెల్లింపులు..
క్రెడిట్ కార్డ్ బిల్లులో కనీస బకాయి మొత్తాన్ని కూడా చెల్లించకపోతే మీకు జరిమానా పడుతుంది. దాన్నే లెట్ ఫీజు (ఆలస్య చెల్లింపు రుసుం) అంటారు. ఇది బ్యాంక్, కార్డ్ జారీ చేసిన సంస్థను బట్టి రూ.100 నుంచి రూ.1000 వరకు ఉంటుంది.
రివాల్వింగ్ క్రెడిట్
అయితే, బిల్లు చెల్లించేకొద్దీ మీ క్రెడిట్ కార్డు లిమిట్ తిరిగి అందుబాటులోకి రానుంది. దీన్నే రివాల్వింగ్ క్రెడిట్ అని పిలుస్తారు. ఉదాహరణకు మీ లిమిట్ రూ.2 లక్షలు అయితే రూ.1 లక్ష ఖర్చు చేశారనుకో.. మిగిలింది రూ.1 లక్ష.. బిల్లు మొత్తం చెల్లిస్తే లిమిట్ మళ్లీ రూ.2 లక్షలకు వస్తుంది. సగం మాత్రమే చెల్లిస్తే, లిమిట్ రూ.1.50 లక్షలే మిగిలి ఉంటుంది.
యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్
ఇప్పటికే ప్రైమరీ/ స్టాండర్డ్ క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్న వారు అదనంగా మరో కార్డును తీసుకోవడాన్ని యాడ్-ఆన్ లేదా సప్లిమెంటరీ క్రెడిట్ కార్డ్ అని పిలుస్తారు. వ్యక్తిగత క్రెడిట్ కార్డులను అందిస్తున్న అనేక సంస్థలు యాడ్-ఆన్ క్రెడిట్ కార్డ్ సదుపాయాన్ని అందజేస్తున్నాయి. వ్యక్తులు తమ ఫ్యామిలీ మెంబర్స్ కోసం ప్రైమరీ క్రెడిట్ కార్డుకు అదనంగా యాడ్-ఆన్ కార్డును తీసుకునే వెసులుబాటు ఉంది.
క్రెడిట్ కార్డు ఈఎంఐ
క్రెడిట్ కార్డు ద్వారా ఏ వస్తువు కొనుగోలు చేసిన ఆ బిల్లును వాయిదాల రూపంలోకి మార్చుకోవడాన్నే ఈఎంఐ అని పిలుస్తారు. బ్యాంకు నుంచి లోన్ తీసుకుని వాయిదాల్లో చెల్లించే తరహాలోనే ఇదీ వర్క్ చేస్తుంది. కొన్నిసార్లు కొనుగోళ్లపై భారీగా వడ్డీ పడుతుంది. కొన్ని కొనుగోళ్లపై నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది.