ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచిన జాతీయ బ్యాంకులు. 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంపు
దేశంలోని రెండు జాతీయ బ్యాంకులు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచాయి. ఇండియన్ బ్యాంక్‌తోపాటు బంధన్ బ్యాంకు వడ్డీ రేట్లను 15 నుంచి 20 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతున్నట్లు ప్రకటించాయి. మెచ్యూరిటీ గడువు ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉన్న ఎఫ్‌డీలకే ఈ పెంపు వర్తిస్తుందని స్పష్టం చేశాయి.
దూసుకుపోతున్న ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు. జూన్‌లో 27 శాతం పెరిగిన రిటైల్ సేల్స్
సెమీ కండక్టర్ల కొరత వల్ల కొన్నాళ్లుగా కష్టాలు ఎదుర్కొంటున్న ఆటోమొబైల్ రంగం కాస్త తేరుకున్న సంకేతాలు వెలువడ్డాయి. గత నెలలో ఆటో ఇండస్ట్రీ అమ్మకాలు దూసుకుపోయాయి. జూన్‌లో రిటైల్ సేల్స్ 27 శాతం పెరిగినట్లు ఆటోమొబైల్ డీలర్ల సంఘాల సమాఖ్య తెలిపింది.
11 ఏళ్ల గరిష్టానికి పీఎంఐ. మేలో 58.8 నుంచి జూన్‌లో 59.2కి పెరుగుదల
పర్చేజెస్ మేనేజర్ ఇండెక్స్ 11 ఏళ్ల గరిష్టానికి చేరింది. మే నెలలో 58.8గా ఉన్న పీఎంఐ జూన్‌లో 59.2కి పెరిగింది. ‘ఎస్ అండ్ పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్’ పీఎంఐ వరుసగా 11వ నెల కూడా పెరగటం విశేషం. కొత్త వ్యాపార వృద్ధి వేగానికి, సేవా సంస్థల ఔట్‌పుట్‌కి ఇది సూచిక అని నిపుణులు చెబుతున్నారు.
నిరాశపర్చిన జాతీయ కార్మిక గణాంకాలు. జూన్‌లో కోటీ 30 లక్షల ఉద్యోగాలు గోవిందా
జాతీయ కార్మిక గణాంకాలు నిరాశపర్చాయి. జూన్ నెలలో ఏకంగా కోటీ 30 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. నాన్ లాక్‌డౌన్ నెలలో ఇంత నిరుద్యోగం నమోదు కావటం ఇదే తొలిసారి.
జీవ ఇంధన పన్ను ప్రయోజనాన్ని విస్తరించిన కేంద్రం. ఇకపై ఇథనాల్ మిశ్రమానికీ ఇది వర్తింపు
జీవ ఇంధన పన్ను ప్రయోజనాన్ని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది. ఈ పరిధిలోకి ఇథనాల్ మిశ్రమాన్నీ చేర్చింది. గ్యాసోలిన్‌లో 12 నుంచి 15 శాతం వరకు కలిపే ఇథనాల్‌కే ఈ ట్యాక్స్ బెనెఫిట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. ప్రపంచంలో అత్యధిక చమురు దిగుమతి మరియు వాడకంలో ఇండియా 3వ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే.
బలపడ్డ డాలర్. బక్కచిక్కిన రూపాయి. ఒక డాలర్ కొనాలంటే ఇవ్వాల్సిన రూపాయలు 79.36
డాలర్ డైలీ బలపడుతోంది. దీంతో రూపాయి మళ్లీ బక్కచిక్కింది. ఫలితంగా ఒక డాలర్ కొనాలంటే 79 రూపాయల 36 పైసలు చెల్లించాల్సి వస్తోంది. అమెరికా కేంద్ర బ్యాంకు వడ్డీ రేట్లను పెంచనుందనే అంచనాల నేపథ్యంలో రూపాయి మారకం విలువ త్వరలోనే 80 మార్కు దాటనుందని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
11,000 మందికి పైగా ఉద్యోగులను తీసేసిన ఇండియన్ స్టార్టప్స్
ఇండియన్ స్టార్టప్‌లు క్రమంగా ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గడచిన 6 నెలల్లో 11 వేల మందికి పైగా స్టాఫ్‌ని ఇంటికి పంపాయి. ఎంప్లాయిస్‌కి ఉద్వాసన పలుకుతున్న స్టార్టప్‌ల లిస్టులో ఓలా, బైజుస్‌తోపాటు ఇతర యూనికార్న్‌లు ఉన్నాయి. పెట్టుబడులకు ప్రతికూల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మరో రెండేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.