మన దేశంలో ‘బాష్’ భారీ పెట్టుబడి
ఆటోమొబైల్ విడి భాగాల తయారీలో పేరున్న, పెద్ద సంస్థ బాష్ లిమిటెడ్ మన దేశంలో భారీఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. ఈ రంగంలో వచ్చే ఐదేళ్లలో రూ.200 కోట్లకు పైగానే (25.12 మిలియన్ డాలర్లు) ఖర్చుచేయనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే స్థానికులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా లభిస్తాయి.
తెలంగాణలో అత్యధిక ద్రవ్యోల్బణం
దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం (10 శాతం) తెలంగాణ రాష్ట్రంలో నమోదైంది. బీహార్‌లో అతి తక్కువ (4.7 శాతం) ఉండటం గమనార్హం. ఆహార ధరల్లో సాధారణ (7.7) పెరుగుదల నెలకొనగా కూరగాయల రేట్లు మాత్రం ఆకాశ్నంటాయి. దీంతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్థిక ప్రగతి సహా దాదాపు అన్ని సూచీల్లో మెరుగైన స్థానంలో ఉండే తెలంగాణ.. ద్రవ్యోల్బణం విషయంలో అనూహ్య ఫలితాలను చవిచూడాల్సి వచ్చింది.
కంపెనీ న్యూస్
మైండ్‌ట్రీ తొలి త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. సంస్థకు స్థిరంగా ఆర్డర్లు వెల్లువెత్తుతున్నట్లు పేర్కొంది. ఏడాదిలో 36.2 శాతం రెవెన్యూ పెరిగిందని, దీంతో ఏకంగా 37 శాతం నికర లాభాలను నమోదు చేసినట్లు తెలిపింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రూ.5000 కోట్లు సేకరించే పనిలో పడింది. ప్రైవేట్ ప్లేస్‌మెంట్ ప్రాతిపదికన బాండ్లును ఈ వారమే వేలం వేయనుంది. కేర్ సంస్థ రేటింగ్స్ 10 శాతం పెరిగాయి. షేర్ల బైబ్యాక్ ప్లాన్‌కి బోర్డ్ ఓకే చెప్పనుందనే వార్తల నేపథ్యంలో ఈ సంకేతం వెలువడింది.
స్టాక్ మార్కెట్ అప్డేట్
స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 50 పాయింట్లు తగ్గి 53,475కి చేరింది. నిఫ్టీ 15,900 వద్ద ట్రేడ్ అవుతోంది. హెల్త్ కేర్ సెక్టార్ షేర్లు స్వల్పంగా లాభపడ్డాయి. వీటి విలువ 1.2 శాతం పెరిగింది. ఎఫ్‌ఎంసీజీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కూడా లాభాలు ఆర్జించాయి. ఈ రెండు రంగాలకు 0.5 శాతం చొప్పున ప్రాఫిట్స్ వచ్చాయి. టాటా మెటాలిక్స్ నికర లాభాలు 99 శాతం తగ్గినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఆ సంస్థ షేర్లు 6 శాతం పడిపోయాయి.
బంగారం ధరలు
99.9 శాతం స్వచ్ఛమైన (24 క్యారెట్ల) తులం బంగారం ఇవాళ హైదరాబాద్‌లో 51,160 రూపాయలు పలుకుతోంది. నిన్నటితో పోల్చితే ఇవాళ ఈ రేటు 210 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.46,900 ఉంది. ఇది నిన్నటితో పోల్చితే రూ.200 పెరిగింది. గత వారం రోజులుగా పెరగని గోల్డ్ రేట్ ఇవాళే రూ.200 పెరగటం గమనార్హం.