హిందూ సంప్రదాయంలో మాఘ మాసానికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అయినప్పటికీ, మాఘ పూర్ణిమకు ఉన్న విశిష్టత అంతా ఇంతా కాదు. ఈ రోజున నదీ స్నానం, దానధర్మాలు చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. 2026 సంవత్సరంలో మాఘ పౌర్ణమి ఎప్పుడు వస్తోంది? ఆ రోజు ఉన్న శుభ ముహూర్తాలేంటి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మాఘ పూర్ణిమ 2026: తేదీ , శుభ సమయాలు
వేద క్యాలెండర్ ప్రకారం, ఈ ఏడాది మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి నెలలో రానుంది. ఉదయ తిథిని ప్రామాణికంగా తీసుకుంటే, ఫిబ్రవరి 1వ తేదీ, ఆదివారం నాడు మాఘ పూర్ణిమ పండుగను జరుపుకోవాలి. పౌర్ణమి తిథి ప్రారంభం.. ఫిబ్రవరి 1, ఆదివారం ఉదయం 05:53 గంటలకు. పౌర్ణమి తిథి ముగింపు.. ఫిబ్రవరి 2, సోమవారం తెల్లవారుజామున 03:39 గంటలకు. ఆదివారం రోజంతా పౌర్ణమి తిథి ఉండటం వల్ల, ఆ రోజు ఉదయాన్నే పవిత్ర స్నానాలు ఆచరించడానికి అత్యంత అనుకూలమైన సమయమని పండితులు చెబుతున్నారు.
మాఘ స్నానం – పాప విముక్తికి మార్గం
మాఘ మాసాన్ని ‘స్నాన మాసం’ అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే గంగా, యమునా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని ‘స్కంద పురాణం’ పేర్కొంటోంది. ఈ రోజున సూర్యుడు మకర రాశిలో, చంద్రుడు కర్కాటక రాశిలో ఉంటారు. ఈ ఖగోళ స్థితి వల్ల నదీ జలాల్లో ప్రత్యేక శక్తి ఉంటుందని, ఆ సమయంలో స్నానం చేస్తే మానసిక, శారీరక రుగ్మతలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.
శివకేశవుల ఆరాధన , విశిష్టత : మాఘ పూర్ణిమ శివుడికి , మహావిష్ణువుకు ఇద్దరికీ ప్రీతికరమైన రోజు.
విష్ణు పూజ: ఈ రోజున సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం లేదా విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల సంపద, సుఖశాంతులు చేకూరుతాయి.
శివారాధన: పరమేశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగిపోతుంది.
దేవతల ఆగమనం: పురాణాల ప్రకారం, మాఘ పౌర్ణమి రోజున ముక్కోటి దేవతలు పవిత్ర నదులలో స్నానమాచరించడానికి భూలోకానికి వస్తారట. అందుకే ఈ రోజు చేసే స్నానం దేవతా అనుగ్రహాన్ని కలిగిస్తుంది.
గురు దోష నివారణకు అద్భుత అవకాశం
మీ జాతకంలో గురు గ్రహ దోషం ఉన్నా లేదా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, మాఘ పూర్ణిమ రోజున కొన్ని పరిహారాలు పాటించడం మంచిది. స్నానం చేసిన తర్వాత నవగ్రహ ఆలయంలో గురు భగవానుడికి పసుపు రంగు వస్త్రం సమర్పించి పూజించాలి. ఇంట్లో పూజ గదిలో ఈశాన్య మూలన ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల గురు అనుగ్రహం కలిగి, విద్యాబుద్ధులు , ధన ప్రాప్తి కలుగుతాయి.
గౌరీ దేవి అనుగ్రహం – వివాహ ప్రయత్నాలు
మాఘ పూర్ణిమ పార్వతీ దేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజున అమ్మవారిని ‘గౌరమ్మ’గా పూజించడం వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు తొలగిపోతాయి. ముఖ్యంగా వివాహం కాని అమ్మాయిలు ఈ రోజున గోరింటాకును దానం చేయడం వల్ల త్వరగా వివాహం జరుగుతుందని, మంచి భర్త లభిస్తాడని నమ్ముతారు. తమలపాకులో పసుపు ముద్దతో గౌరమ్మను చేసి భక్తితో పూజించి బెల్లం నైవేద్యంగా సమర్పించాలి.
దానమే పరమావధి
“మాఘే మాసే ప్రయచ్ఛేత తిలన్ కంబళ వాససి” అన్నట్లుగా.. ఈ రోజున నువ్వులు (తిల దానం), అన్నదానం, లేదా వస్త్ర దానం చేయడం వల్ల అపరిమితమైన పుణ్యం లభిస్తుంది. వీలైన వారు సముద్ర స్నానం లేదా నదీ స్నానం ఆచరించడం ద్వారా మాఘ మాస ఫలాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు.
Padma Awarads 2026 : తెలుగు రాష్ట్రాల్లో పద్మ అవార్డులు వచ్చింది వీరికే..!