Tata Motors: టాటా మోటార్స్ సంచలన ప్రకటన చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల్లో అగ్రగామిగా ఉన్న టాటా తన రెండు నెక్సాన్ ఈవీ, టియాగో ఈవీలపై భారీగా ధరని తగ్గించింది. ఈ రెండు కార్లు ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ కార్లుగా ఉన్నాయి. నెక్సాన్ ఈవీ ధర రూ. 1.20 లక్షల వరకు తగ్గనుంది. దీంతో నెక్సాన్ ఈవీ రూ. 14.49 లక్షల(ఎక్స్-షోరూం) ప్రారంభ ధర నుంచి ప్రారంభం కానుంది. ఇక టియాగో ఈవీ విషయాని వస్తే దీనిపై రూ. 70,000 తగ్గింపు వర్తించనుంది. దీంతో దీని ధర ప్రస్తుతం రూ. 7.99 లక్షల (ఎక్స్-షోరూం)గా ఉంది. నెక్సాన్ ఈవీ లాంగ్ రేంజ్(465 కి.మీ) ధర ఇప్పుడు రూ. 16.99 లక్షల (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభం అవుతుంది.
Read Also: Burj Khalifa: ప్రధాని మోడీకి యూఏఈ సత్కారం.. బుర్జ్ ఖలీఫాపై వెలిగిపోయిన త్రివర్ణ పతాకం..
ఈవీ వాహనాల బ్యాటరీ ప్యాక్ ధరలు తగ్గడంతో వినియోగదారులకు ఈ ప్రయోజనాలను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. అయితే, ఇటీవల టాటా ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పంచ్ ఈవీ ధరల్లో మాత్రం మార్పులు రాలేదు. టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (TPEM) చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స ధరల తగ్గింపు గురించి మాట్లాడుతూ.. బ్యాటరీ ఖర్చులు ఈవీల్లో ఎక్కువ ధరను కలిగి ఉంటాయని, ఇటీవల కాలంలో బ్యాటరీ సెల్స్ ధరలు తగ్గడంతో కస్టమర్లకు ఈ ప్రయోజనాలు అందించేందుకు సిద్ధమయ్యామని చెప్పారు.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో టాటా తిరుగులేని రారాజుగా ఉంది. తక్కవ ధర, సేఫ్టీ, ఎక్కువ ఫీచర్లను అందిస్తుండటంతో ఈవీలను కొనుగోలు చేయాలనుకునే వారు టాటానే ప్రిఫర్ చేస్తున్నారు. టాటా ఈవీ విభాగంలో నెక్సాన్, టియాగో, టిగోర్, పంచ్ కార్లు ఉన్నాయి. త్వరలోనే టాటా నుంచి హారియర్ ఈవీ రాబోతోంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో కూడా దీన్ని ప్రదర్శించారు.