2024లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విక్రయాల్లో నార్వే ప్రధాన మైలురాయిని సాధించింది. నార్వేజియన్ రోడ్ ఫెడరేషన్ (OFV) ప్రకారం.. 2024లో విక్రయించిన కొత్త కార్లలో 88.9% పూర్తిగా ఎలక్ట్రిక్ కార్లు ఉన్నాయి. 2023లో ఇది 82.4% గా నమోదైంది. యూరోపియన్ యూనియన్ 2035 నాటికి కార్బన్ డయాక్సైడ్ విడుదల చేసే కార్ల అమ్మకాలను నిషేధించాలని నిర్ణయించింది. ఈ పెరుగుదల 2025 నాటికి అన్ని కొత్త కార్లను జీరో ఎమిషన్ వెహికల్స్‌గా మార్చే లక్ష్యంతో నార్వేను చేరువ చేసింది.
పన్ను మినహాయింపు…
నార్వేలో అత్యధిక ఈవీలను విక్రయించిన కంపెనీలు టెస్లా, వోక్స్‌వ్యాగన్, టయోటాతోపాటు ఎమ్‌జీ, బీవైడీ, ఎక్స్ పెంన్గ్ ( XPeng) వంటి చైనీస్ కంపెనీలు ఉన్నాయి. దీనితో చైనీస్ ఈవీల మార్కెట్ వాటా 10%కి చేరుకుంది. నార్వే ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ కార్లపై పన్నులను పెంచింది. అయితే ఈవీలపై ఎటువంటి దిగుమతి పన్ను, వ్యాట్ (విలువ ఆధారిత పన్నులు) విధించబడలేదు. ఇది వినియోగదారులకు మరింత జోష్ ఇచ్చింది. అయితే, కొన్ని పన్నులు 2023లో తిరిగి ప్రవేశపెట్టబడ్డాయి. అయినప్పటికీ ఈవీలపై ప్రజాదారణ తగ్గలేదు.
మౌలిక సదుపాయాల అభివృద్ధి..
నార్వేలో పెరుగుతున్న ఎలక్ట్రిక్ కార్ల సంఖ్యతో ఛార్జింగ్ స్టేషన్లు వంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల విస్తరణ మెరుగ్గా ఉంది. దీని కోసం.. దేశంలోని పెట్రోల్ పంపులు వేగంగా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్‌లుగా మార్చుతున్నారు. తద్వారా పెరుగుతున్న ఛార్జింగ్ డిమాండ్‌ను తీర్చవచ్చు. నార్వేలో ఇప్పుడు 27,000 కంటే ఎక్కువ పబ్లిక్ ఛార్జర్‌లు ఉన్నాయి. దీని అర్థం నార్వేలో ప్రతి 100,000 మందికి 447 ఛార్జర్‌లు ఉన్నాయి. యూఎస్‌లో 15 ఛార్జర్‌లు.. భారతదేశంలో 89 మాత్రమే ఉన్నాయి.
సవాళ్లు ఏమిటి?
ఈవీల ప్రజాదరణ పెరుగుతోంది. కానీ దానితో పాటు కొన్ని సవాళ్లు కూడా వస్తున్నాయి. ఇందులో ప్రధాన సమస్య చలికాలంలో ఛార్జింగ్ సమయం పెరగడం, దీని కారణంగా డ్రైవర్లు కొంత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది కాకుండా, ఈవీలను ఉపయోగించడం పర్యాటకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుంది. నార్వేలో ఈవీలకు ఈ మార్పు సరైన విధానాలు, ప్రోత్సాహకాలతో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణను పెంచవచ్చని చూపిస్తుంది. భారతదేశంతో సహా ఇతర దేశాలు తమ వాహన మార్కెట్‌లను మరింత పర్యావరణ అనుకూలమైనవిగా ఎలా మార్చుకోవచ్చనే విషయంలో ఇది ఒక ఉదాహరణగా నిలుస్తుంది.