దక్షిణ కొరియా కార్ల తయారీదారు కియా జనవరిలో జరిగిన ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారు ఫేస్‌లిఫ్ట్ మోడల్ అధికారికంగా భారత మార్కెట్లో అమ్మకానికి విడుదల చేసింది. కంపెనీ దీనిని GT-Line AWD అనే ఒకే ఒక వేరియంట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర రూ. 65.9 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. దీని ఆకర్శనీయమైన లుక్‌తో పాటు అత్యధిక రేంజ్ జనాలను ఆకట్టుకుంటోంది. ఇందులో పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను అందించామని కంపెనీ తెలిపింది. మరి ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..
కియా కొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ లుక్..
కియా ఈవీ6 ఫేస్‌లిఫ్ట్ మోడల్ లుక్, డిజైన్‌లో కొన్ని మార్పులు చేశారు. బాహ్య నవీకరణలలో కొత్త బంపర్లు, స్టార్ మ్యాప్ హెడ్‌లైట్‌లు అమర్చారు. ఈ సిగ్నేచర్ లైట్లను ఫ్లాగ్‌షిప్ కియా ఈవీ9 ఎస్‌యూవీ, విదేశీ మార్కెట్లలో విక్రయించే ఈవీ3 లలో కూడా చూడవచ్చు. అయితే.. కియా ఈవీ6లో 19-అంగుళాల అల్లాయ్ వీల్స్, వెనుక బంపర్, టెయిల్-లైట్లకు కొన్ని డిజైన్లను అప్‌డేట్ చేశారు. కారు పరిమాణంలో ఎటువంటి మార్పు లేదు. దీని పొడవు 4,695 మిమీ, వెడల్పు 1,890 మిమీ, ఎత్తు 1,570 మిమీ. వీల్‌బేస్ 2,900 మిమీ. పరిమాణంలో ఎటువంటి మార్పు లేనప్పటికీ.. ఇందులో కియా పెద్ద బ్యాటరీని అమర్చగలిగింది. ఈ బ్యాటరీ మెరుగైన పనితీరుకు ప్రసిద్ధి చెందిందని కంపెనీ పేర్కొంది.
శక్తి, పనితీరు:
కియా ఈవీ6 లో కంపెనీ ముందు, వెనుక రెండు ఎలక్ట్రిక్ మోటార్లను అందించింది. ఇది ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ రెండు ఎలక్ట్రిక్ మోటార్లు కలిసి 325hp పవర్, 605Nm టార్క్ ఉత్పత్తి చేస్తాయి. ఈ కారు కేవలం 5.3 సెకన్లలోనే గంటకు 0 నుంచి 100 కి.మీ వేగాన్ని అందుకోగలదని కంపెనీ పేర్కొంది. ఈ కారు ఎలక్ట్రిక్ గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫామ్ (E-GMP) పై నిర్మించబడింది.
18 నిమిషాల్లో ఛార్జ్.. 663 కి.మీ రేంజ్..
అయితే.. ఈ కారులో 84kWh నికెల్-మాంగనీస్-కోబాల్ట్ (NMC) బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ఫేస్‌లిఫ్ట్‌కు ముందు మోడల్ 77.4kWh బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ బరువు తక్కువగా ఉంటుంది. ఈ కారు ఒక్కసారి ఛార్జ్ చేస్తే 663 కి.మీ (ARAI) రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. అంతే కాకుండా.. 350kW సామర్థ్యం గల డీసీ ఫాస్ట్ ఛార్జర్‌తో బ్యాటరీని 18 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అయితే 50kW డీసీ ఛార్జర్‌తో 73 నిమిషాలు పడుతుంది.