India Now World’s 3rd Largest Auto Market After China And US: ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమార్కెట్ గా ఇండియా ఉంది. ప్రస్తుతం ఈ విషయంలో ఇండియా మరో ఘనత సాధించింది. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆటో మార్కెట్ గా అవతరించింది. జపాన్ దేశాన్ని అధిగమించి మన దేశం ఈ స్థానంలోకి చేరింది. నిక్కీ ఆసియా ప్రకారం.. మొదటిసారిగా ఇండియా మూడో స్థానానికి చేరినట్లు శుక్రవారం వెల్లడించింది. భారతదేశంలో ఈ ఏడాది వాహనాల విక్రయం కనీసం 4.25 మిలియన్ యూనిట్లుగా ఉందని.. జపాన్ విక్రయించిన వాహనాలు 4.2 మిలియన్ల కన్నా ఎక్కువ అమ్మకాలను నమోదు చేసినట్లు నివేదిక వెల్లడించింది.
ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఆటోమార్కెట్ గా చైనా ఉండగా.. రెండో స్థానంలో అమెరికా, మూడో స్థానంలో ఇండియా, నాలుగో స్థానంలో జపాన్ దేశాలు ఉన్నాయి. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ ప్రకారం, జనవరి-నవంబర్ 2022 మధ్య భారతదేశంలో 4.13 మిలియన్ల వాహనాలను డెలివరీ చేశారు. భారతదేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఆదివారం నివేదించిన డిసెంబర్ అమ్మకాలను కలుపుకుంటే.. మొత్తంగా దాదాపుగా 4.25 మిలియన్ యూనిట్లకు చేరుకుంది.
Read Also: China: మూడేళ్ల తర్వాత యధాస్థితికి చైనా.. సాధారణ వ్యాధుల జాబితాలోకి కోవిడ్
నిక్కీ ఆసియా ప్రకారం టాటా మోటార్స్, ఇతర వాహన తయారీ కంపెనీలు సంవత్సరాంతపు ఫలితాలతో పాటు వాణిజ్య వాహనాల నాల్గోత్రైమాసిక అమ్మకాలను కలుపుకుంటే భారతదేశంలో విక్రయించబడిన వాహనాల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది. 2021లో చైనా 26.27 మిలియన్ల వాహనాలను విక్రయించి ప్రపంచ ఆటో మార్కెట్ లో అగ్రగామిగా ఉంది. ఇక అమెరికా 15.4 మిలియన్ వాహనాలతో రెండో స్థానంలో జపాన్ 4.44 మిలియన్ల యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానంలో ఉంది.
ఇటీవల భారత ఆటో మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనవుతోందని నిక్కీ ఆసియా వెల్లడించింది. 2018లో దాదాపుగా 4.4 మిలియన్ వాహనాలు అమ్ముడయ్యాయి. అయితే 2019లో 4 మిలియన్ల కన్నా తక్కువ అమ్మకాలు నమోదు అయ్యాయి. కోవిడ్ మహమ్మారి తర్వాత 2021లో మార్కెట్ కోలుకుని 4 మిలియన్ల యూనిట్ల వాహనాల అమ్మకాలను చేరుకుంది. అయితే అమ్మకాలపై సెమికండక్టర్ల కొరత కూడా ప్రభావం చూపించినట్లు నివేదిక వెల్లడించింది.
పెట్రోల్, డిజిల్ తో నడిచే వాహనాలే ఇండియాలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఇప్పటికీ తక్కువగానే ఉన్నాయని నివేదిక వెల్లడించింది. 2021లో ఓ నివేదిక ప్రకారం కేవలం 8.5 శాతం భారతీయ కుటుంబాలు మాత్రమే ప్యాసింజర్ వాహనాలను కలిగి ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం పెట్రోల్ దిగుమతి ఫలితంగా వాణిజ్య లోటు ఏర్పడటంతో ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల పై సబ్సిడీలు అందిస్తోంది.