నష్టాల సాకు చూపి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను బలి చేస్తారా అంటూ రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి… ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఆయన.. ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ బీమా సంస్థల ప్రైవేటీకరణను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రదర్శిస్తున్న దూకుడు వలన ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రం తీవ్రంగా నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏడాదిన్నరగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం తనకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోందని మండిపడ్డ ఆయన.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆలోచనను విరమించికోవాలని కోరుతూ అనేకసార్లు మంత్రులను కలిసి విన్నవించినా పట్టించుకోకుండా ప్రభుత్వం ముందుకు సాగడం తీవ్ర విచారకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Tirumala: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ
నష్టాలను సాకుగా చూపి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని ఆరోపించారు సాయిరెడ్డి.. కానీ, ఈ నష్టాలకు కారణాలు ఏమిటో తెలుసుకుని వాటిని సరిదిద్దడానికి ప్రభుత్వం ఏనాడూ చిత్తశుద్ధితో వ్యవహరించలేదని అన్నారు. స్టీల్ ప్లాంట్ నష్టాల బారిన పడటానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయన్న ఆయన.. మొదటిది… విశాఖ ఉక్కుకు ప్రభుత్వం కేప్టివ్ మైన్స్ కేటాయించకపోవడం… కేప్టివ్ మైన్స్ లేని కారణంగా ముడి ఇనుప ఖనిజాన్ని స్టీల్ ప్లాంట్ బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేయవలసి వస్తోందన్నారు. ఇతర ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజం గనులు ఉన్నందున వాటికి ముడి ఖనిజం చాలా చౌకగా లభిస్తోందని.. బహిరంగ మార్కెట్లో అత్యధిక ధరకు ముడి ఖనిజం కొనుగోలు చేస్తున్న విశాఖ ఉక్కు అలాంటి కంపెనీలతో మార్కెట్‌లో పోటీని ఎదుర్కొనేందుకు నష్టాలను భరించాల్సి వస్తోందన్నారు.. ఇక, రెండో కారణం… విశాఖ ఉక్కుపై రుణం, వడ్డీ చెల్లింపుల భారాన్ని తగ్గించేందుకు రుణాలను ఈక్విటీ కింద మార్చే వెసులుబాటు కేంద్ర ప్రభుత్వానికి ఉంది.. కానీ, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం అందుకు ససేమిరా అంటూ చివరకు ప్రైవేటీకరణ వైపే అడుగులు వేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వేయి కోట్ల లాభాలను ఆర్జించింది.. ఈ వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం నాడు రూ. 5 వేల కోట్లు పెట్టుబడి పెడితే దానికి 10 రెట్లు… అంటే 51 వేల కోట్ల రూపాయలను వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్ల రూపంలో చెల్లించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం అంతర్జాతీయంగా ఉక్కు రంగం ఉజ్వల స్థితిలో ఉంది.. వైజాగ్ స్టీల్ కూడా లాభాల బాట పట్టింది… కాబట్టి ఈ తరుణంలో స్టీల్ ప్లాంట్‌ను కేంద్రం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం ఏమాత్రం సమంజసం కాదని విజ్ఞప్తి చేశారు విజయసాయిరెడ్డి..